శ్రీలంక బతికిపోయింది..!

20 Nov, 2017 16:48 IST|Sakshi

కోల్ కతా: భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు ఆటలో భాగంగా  231 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు కోల్పోయి 75 పరుగుల వద్ద ఉండగా బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. దాంతో విజయం దిశగా పయనించిన  భారత జట్టు డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్ కు వికెట్ దక్కింది.

ప్రధానంగా రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల విజృంభణ కొనసాగింది. భారత పేస్ త్రయం లంకేయుల్ని ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసింది. దాంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. ఆపై చండిమాల్(20), డిక్ వెల్లా(27)లు కాసేపు ప్రతిఘటించడంతో లంక గాడిలో పడినట్లు కనిపించింది. వీరిద్దరూ 69 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అదే ఊపులోపెరీరా ను కూడా డకౌట్ గా అవుట్ చేయడంతో భారత్ విజయం దాదాపు ఖాయంగా కనబడింది. కాకపోతే వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ ను నిలిపివేయడంతో ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ  శ్రీలంక తప్పించుకుని బ్రతికిపో్గా, భారత్ మాత్రం తృటిలో విజయానికి దూరమైంది.


అంతకుముందు  171/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాకిచ్చాడు లక్మల్.తొలుత కేఎల్ రాహుల్(79;125 బంతుల్లో8 ఫోర్లు) ను అవుట్ చేసిన లక్మల్..కాసేపటికి చతేశ్వర పుజారా(22), అజింక్యా రహానే(0)లను వరసు బంతుల్లో అవుట్ చేశాడు. 21 పరుగుల వ్యవధిలో ముగ్గరు టాపార్డర్ ఆటగాళ్లను లక్మల్ అవుట్ చేసి లంక శిబిరంలో ఆనందం నింపాడు.  ఇక రవీంద్ర జడేజా(9) వికెట్ ను పెరీరా సాధించాడు. కాగా, కోహ్లి మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తే ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లి..ఆపై దాన్ని సెంచరీగా మలచుకున్నాడు.  119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 104 పరుగులు చేశాడు. ఇది విరాట్ కు ఈడెన్ లో తొలి టెస్టు సెంచరీ కాగా, ఈ ఫార్మాట్ లో కోహ్లికి 18వ సెంచరీ. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను కోహ్లి 50కి పెంచుకున్నాడు. వన్డే ఫార్మాట్ లో ఇప్పటివరకూ కోహ్లి 32 సెంచరీలను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ యాభై, అంతకుపైగా అంతర్జాతీయ సెంచరీలను సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ ముందువరుసలో ఉండగా, అటు తరువాత ఆ ఘనతను సాధించిన టీమిండియా క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం.

మరిన్ని వార్తలు