పట్టు బిగించారు

28 Jul, 2017 00:14 IST|Sakshi
పట్టు బిగించారు

ఫాలోఆన్‌ దిశగా శ్రీలంక
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 600 ఆలౌట్‌
శ్రీలంక 154/5


గాలే టెస్టులో లంక విలవిలలాడుతోంది. భారత్‌ జోరు రెండో రోజూ కొనసాగింది. మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించింది. అరంగేట్రం చేసిన హార్దిక్‌ పాండ్యా, పేసర్‌ షమీ బ్యాటింగ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ  షమీ కీలక వికెట్లు పడగొట్టడంతో లంక జట్టు ఫాలోఆన్‌ ప్రమాదంలో పడింది. రెండో రోజు తరంగ రనౌట్‌ హైలైట్‌. రెప్పపాటు కాలంలోనే ఫీల్డర్‌ ముకుంద్, కీపర్‌ సాహా సమన్వయం ఆతిథ్య జట్టును పెద్ద దెబ్బ తీసింది.

గాలే: కోహ్లి సేన ఆల్‌రౌండ్‌ జోరు చూస్తుంటే తొలి టెస్టు చేతిలోకి వచ్చినట్టే కనబడుతోంది. మొదటి రోజు బ్యాటింగ్‌లో భారీస్కోరు చేసిన భారత్‌... రెండోరోజు బౌలింగ్‌లో లంకను చావుదెబ్బ తీసింది. దీంతో ఇప్పుడు శ్రీలంక ఫలితం కోసం కాకుండా ‘ఫాలోఆన్‌’ను తప్పించుకునేందుకే పోరాడుతోంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 133.1 ఓవర్లలో 600 పరుగులు చేసి ఆలౌటైంది. సెంచరీ హీరో చతేశ్వర్‌ పుజారా (265 బంతుల్లో 153; 13 ఫోర్లు) త్వరగానే ఔటైనా... రహానే (130 బంతుల్లో 57; 3 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (49 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. లంక బౌలర్‌ నువాన్‌ ప్రదీప్‌ 6, లాహిరు కుమార 3 వికెట్లు తీశారు. తర్వాత శ్రీలంక ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఉపుల్‌ తరంగ (93 బంతుల్లో 64; 10 ఫోర్లు), మాథ్యూస్‌ (91 బంతుల్లో 54 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. షమీకి 2 వికెట్లు దక్కాయి.

ఇప్పుడు రనౌట్‌... అక్టోబర్‌ నుంచి నాటౌట్‌!
చివరి సెషన్‌లో కుదురుగా ఆడుతున్న తరంగ రనౌట్‌ అనూహ్యం... అద్భుతం! ఫీల్డర్‌ ముకుంద్, కీపర్‌ సాహా మెరుపు సమన్వయానికి నిదర్శనం. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ చివరి బంతిని తరంగ సిల్లీ పాయింట్‌ వైపు ఆడాడు. అక్కడే ఉన్న ముకుంద్‌ ఆలస్యం చేయకుండా కీపర్‌కు అం దించగా... సాహా బెయిల్స్‌ను పడగొట్టాడు. అప్పటికే తరంగ బ్యాట్‌ క్రీజ్‌లోకి చేరినా... సాహా బెయిల్స్‌ పడేసే సమయానికి బ్యాట్‌ గాల్లోకి లేచింది. దీంతో తరంగ అవుట య్యాడు. అక్టోబర్‌ 1 నుంచి మారే కొత్త నిబంధనల ప్రకారం బంతి వికెట్లను తాకే సమయానికి బ్యాట్‌ క్రీజ్‌లోకి చేరితే చాలు. బెయిల్స్‌ పడే సమయంలో బ్యాట్‌ గాల్లో ఉన్నా నాటౌట్‌గానే పరిగణిస్తారు. 

సెషన్‌–1 రాణించిన అశ్విన్‌
ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానేలను లంక బౌలర్లు నిలువరించారు. ఆట ఆరంభంలోనే పుజారాను ప్రదీప్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే అర్ధసెంచరీ తర్వాత రహానే... లాహిరు బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఈ దశలో అశ్విన్‌ (60 బంతుల్లో 47; 7 ఫోర్లు), వృద్ధిమాన్‌ సాహా (16) జట్టు స్కోరును 500 పరుగులకు చేర్చారు. లంచ్‌ విరామానికి ముందు వీరిద్దరూ నిష్క్రమించడంతో భారత్‌ 503/7 స్కోరుతో సెషన్‌ను ముగించింది.
ఓవర్లు: 27, పరుగులు: 104, వికెట్లు: 4

సెషన్‌–2 పాండ్యా దూకుడు
ఈ సెషన్‌ మొదలైన కాసేపటికే రవీంద్ర జడేజా అవుటయ్యాడు. ఈ దశలో హార్దిక్‌ పాండ్యాకు జతయిన షమీ ఆతిథ్య బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హెరాత్‌ బౌలింగ్‌లో షమీ, ప్రదీప్‌ బౌలింగ్‌లో పాండ్యా చెరో 3 సిక్సర్లు బాదారు. వేగంగా తొమ్మిదో వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 62 పరుగులు జతచేరాయి. పాండ్యా 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి బంతికే అతను ఔటవ్వడంతో 600 పరుగుల వద్ద భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఓవర్లు: 16.1, పరుగులు: 97, వికెట్లు: 3 (భారత్‌)
ఓవర్లు: 7, పరుగులు: 38, వికెట్లు: 1 (శ్రీలంక)


సెషన్‌–3 షమీ జోరు
చివరి సెషన్‌లో ఈ సారి షమీ బంతితో దెబ్బ తీశాడు. తొలుత గుణతిలక (16)ను, మెండిస్‌ (0)ను నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియన్‌ చేర్చాడు. ఈ ఇద్దరి క్యాచ్‌లు ధావన్‌ చేతికి చిక్కాయి. 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను మాథ్యూస్, తరంగ ఆదుకున్నారు. వీరిద్దరూ నిలదొక్కుకుంటున్న తరుణంలో అర్ధసెంచరీ పూర్తయ్యాక తరంగ రనౌటయ్యాడు.
ఓవర్లు: 37, పరుగులు: 116, వికెట్లు: 4

మరిన్ని వార్తలు