లంక స్పిన్‌కు  దక్షిణాఫ్రికా దాసోహం

15 Jul, 2018 01:31 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో 73 పరుగులకే ఆలౌట్‌శ్రీలంక 278 పరుగులతో  భారీ విజయం

గాలె: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శ్రీలంక అద్భుతం చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక స్పిన్‌ ఉచ్చులో చిక్కిన సఫారీ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడం అటు ఉంచితే వికెట్‌ కాపాడుకోవడానికి విలవిల్లాడారు. 352 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా...  ఆఫ్‌ స్పిన్నర్‌ దిల్‌రువాన్‌ పెరీరా (6/32), వెటరన్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రంగన హెరాత్‌ (3/38) ధాటికి బెంబేలెత్తి 73 పరుగులకే ఆలౌటైంది.

ఫిలాండర్‌ (22 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. ఈ స్పిన్‌ జోడీ ధాటికి కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం తర్వాత దక్షిణాఫ్రికాకు ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 111/4తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 190 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్‌ (35; 1 ఫోర్, 1 సిక్స్‌), లక్మల్‌ (33 నాటౌట్‌; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో మహరాజ్‌ 4, రబడ 3 వికెట్లు పడగొట్టారు. దిముత్‌ కరుణరత్నేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కొలంబోలో రెండో టెస్టు జరుగనుంది.   
 

►73  పునరాగమనం అనంతరం ఒక ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు అత్యల్ప స్కోరు. గతంలో 79 (భారత్‌పై 2015లో).

►రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దక్షిణాఫ్రికా జట్టు చేసిన మొత్తం పరుగులు 199. శ్రీలంక ఓపెనర్‌ కరుణరత్నే ఒక్కడే రెండు ఇన్నింగ్స్‌లలో 218 పరుగులు చేయడం విశేషం.   

మరిన్ని వార్తలు