మా క్రికెటర్లు సిగ్గుపడాలి: లంక కోచ్

27 Nov, 2017 21:49 IST|Sakshi

నాగ్‌పూర్‌: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఓటమి నుంచి డ్రాతో గట్టెక్కి సంబరాలు చేసుకుంది శ్రీలంక జట్టు. కానీ రెండో టెస్టులో టీమిండియా విశ్వరూపం చూపించింది. దీంతో పర్యాటక లంక జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 239 పరుగులతో సోమవారం దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. జట్టు ఆటగాళ్ల దారుణ వైఫల్యంపై లంక క్రికెట్ తాత్కాలిక కోచ్ నిక్ పోథాస్ తీవ్రంగా స్పందించాడు. ఇంత ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్నందుకు లంక క్రికెటర్లు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రూపొందించిన ప్రణాళికలు చక్కగా అమలు చేస్తే విజయాలు సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డాడు.  

నాగ్‌పూర్ టెస్ట్ ఓటమి అనంతరం కోచ్ నిక్ పోథాస్ మీడియాతో మాట్లాడారు. 'ఓటమి కంటే ఓడిపోయిన తీరుతో లంక ఆటగాళ్లు ఎంతో సిగ్గు పడాలి. ఎందుకంటే.. టీమిండియా 600 పైచిలుకు పరుగులు చేస్తే అందులో బౌండరీల రూపంలో వచ్చిన స్కోరు 37 శాతం మాత్రమే. కాగా మా లంక ఆటగాళ్లు సాధించిన పరుగులలో 61 శాతం బౌండరీల రూపంలో వచ్చినవే. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటింగ్ జట్టు ఎలా పరుగులు చేయాలో భారత్ రుచి చూపించింది. అందుకే వారు బౌండరీల రూపంలో 37 శాతం స్కోరు మాత్రమే చేశారు. బౌండరీల రూపంలోనే సాధ్యమైనన్ని పరుగులు చేయాలని నేను మా జట్టుకు సూచించలేదు. ఏంజెలో మాథ్యూస్‌ వంటి సీనియర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్కోరు చేయకుంటే నెట్స్‌లో ఎంత చెమటోడ్చినా ఏం లాభమని' లంక కోచ్ జట్టు ఆటగాళ్లను ప్రశ్నించారు. చేయకుంటే ఎంత నెట్‌ప్రాక్టీస్‌ చేసినా వృథానే’ అని అన్నారు. లంక తొలి ఇన్నింగ్స్‌లో 205, రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే చాపచుట్టేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 610/6 వద్ద డిక్లేర్ చేసింది.

మరిన్ని వార్తలు