ఇప్పుడే ఏమీ చెప్పలేం

18 Apr, 2020 05:02 IST|Sakshi

శ్రీలంకలో ఐపీఎల్‌పై బీసీసీఐ వర్గాలు

న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా వేయడంతో లీగ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ముందుకొచ్చింది. అయితే తాజా పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం. ప్రపంచమంతా లాక్‌డౌన్‌ అయిన ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపాదన గురించి ఆలోచించలేమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఐపీఎల్‌కు ఆతిథ్యమివ్వాలనే తమ ఆకాంక్షను గురువారం బయటపెట్టాడు.

కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న తమ దేశంలో లీగ్‌ నిర్వహిస్తే లంక బోర్డుకు ఆర్థికంగా దన్నుగా ఉంటుందన్నారు. అయితే శ్రీలంక బోర్డు నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని దీనిపై ఇప్పుడు చర్చ అనవసరమని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై మరో సీనియర్‌ అధికారి మాట్లాడుతూ ‘భారత్‌కు శ్రీలంక మిత్ర దేశం. వారి ప్రతిపాదనలో అర్థముంది. కానీ మే నెలలో ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ విరమణ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులన్నీ తారుమారవుతాయి. భారత్‌ అధికారికంగా లీగ్‌ నిర్వహించలేమని పేర్కొంటే మరిన్ని విదేశీ బోర్డులు ఆతిథ్యం కోసం ముందుకొస్తాయి’ అని పేర్కొన్నారు.     

మరిన్ని వార్తలు