లంక...విజయ ఢంకా

24 Feb, 2019 00:09 IST|Sakshi

రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై గెలుపు

సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గిన 

తొలి ఆసియా జట్టుగా ఘనత

శ్రీలంక అద్భుతం చేసింది. వివాదాలు, విమర్శలు, అనేక అపజయాల మధ్య దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన ఆ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. సఫారీలను వరుసగా రెండో టెస్టులోనూ ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా, మొత్తమ్మీద ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత మూడో జట్టుగా రికార్డులకెక్కింది. భారత్, పాకిస్తాన్‌లకు సైతం సాధ్యం కాని ఘనతను అందుకుంది. పతనావస్థలో ఉన్న తమ దేశ క్రికెట్‌కు కొత్త ఊపిరిలూదింది.   

పోర్ట్‌ ఎలిజబెత్‌: ఛేదనలో చేతులెత్తేయకుండా, దక్షిణాఫ్రికాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా శ్రీలంక రెండో టెస్టును గెలుచుకుంది. శనివారం ఇక్కడ మూడో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో 197 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. ప్రత్యర్థి పేసర్లకు ఎదురు నిలిచిన యువ బ్యాట్స్‌మెన్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుశాల్‌ మెండిస్‌ (110 బంతుల్లో 84 నాటౌట్‌; 13 ఫోర్లు); ఒషాద ఫెర్నాండో (106 బంతుల్లో 75 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు మూడో వికెట్‌కు అజేయంగా 163 పరుగులు జోడించి లంకకు టెస్టుతో పాటు చిరస్మరణీయ సిరీస్‌ విజయాన్ని కట్టబెట్టారు.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ కుశాల్‌ పెరీరా అద్వితీయ శతకం (153 నాటౌట్‌)తో తొలి టెస్టులో లక్ష్యాన్ని వికెట్‌ తేడాతో చేరుకున్న పర్యాటక జట్టు... రెండోదాంట్లో 8 వికెట్లతో ఛేదించి సిరీస్‌ను 2–0తో వశం చేసుకోవడం గమనార్హం. ఇరు జట్లకు గెలుపు అవకాశాలు సమాన దూరంలో ఉండగా, ఓవర్‌నైట్‌ స్కోరు 60/2తో విజయానికి 137 పరుగులు అవసరమైన స్థితిలో శనివారం బరిలో దిగిన లంక... మెండిస్, ఒషాద దూకుడుతో మరో 29.4 ఓవర్లకే పని పూర్తి చేసింది. మరోవైపు ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ మార్చి 3న జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది. 

మరిన్ని వార్తలు