అంపైర్ నిర్ణయంపై శ్రీలంక నిరసన

13 Jun, 2016 16:37 IST|Sakshi
అంపైర్ నిర్ణయంపై శ్రీలంక నిరసన

లండన్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య చివరి టెస్టులో ఫీల్డ్ అంపైర్ రాడ్ టక్కర్ తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదమైంది.  నాల్గో రోజు ఆటలో భాగంగా ఆదివారం శ్రీలంక బౌలర్ నువాన్ ప్రదీప్ వేసిన బంతికి ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్  బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి నో బాల్ అంటూ అంపైర్ రాడ్ టక్కర్ ప్రకటించాడు. కాగా, ఆ బంతి నో బాల్ కాదని టీవీ రిప్లేలో స్పష్టంగా కనబడింది. బౌలర్ నువాన్ ప్రదీప్ ముందు కాలు క్రీజ్ బయటే ఉన్నా, అది అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. ఆ సమయానికి హేల్స్ 58 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

 అంపైర్ తప్పుడు నిర్ణయంతో బతికి పోయిన హేల్స్ 94 పరుగులు చేసి అవుటయ్యాడు.  దీనిపై శ్రీలంక క్రికెట్ జట్టు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇక నుంచి నో బాల్ నిర్ణయాలు అన్నీ థర్డ్ అంపైర్ కు ఇవ్వాలని శ్రీలంక జట్టు డిమాండ్ చేసింది. దీనిలోభాగంగా శ్రీలంక జట్టు తమ జాతీయ జెండాను ఆటగాళ్లు కూర్చొనే బాల్కనీకి వేలాడదీసి వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు