శ్రీలంకకు పరీక్ష

15 Jun, 2019 04:59 IST|Sakshi
లంక కెప్టెన్‌ కరుణరత్నే

పటిష్టమైన ఆసీస్‌తో పోరు నేడు

నిలకడలేమి అసలు ప్రత్యర్థి

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్స్‌స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్షప్రసారం

లండన్‌: రెండు మ్యాచ్‌లు వర్షార్పణంతో డీలా పడిన శ్రీలంక శనివారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో లంక జూన్‌ 4 తర్వాత బరిలోకే దిగలేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో జరగాల్సిన మ్యాచ్‌లు కనీసం టాస్‌ అయిన పడకుండానే రద్దయ్యాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచిన ఈ జట్టు 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. జట్టు పరిస్థితి అధోగతిలో ఉంది. నిలకడే లేని బ్యాటింగ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

కివీస్‌తో చేతులేత్తేసిన బ్యాట్స్‌మెన్‌... అఫ్గాన్‌ ధాటికీ ఆపసోపాలు పడ్డారు. ఏదో బౌలర్ల పుణ్యమాని ఆ మ్యాచ్‌ గెలిచింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కరుణరత్నే, కుశాల్‌ పెరీరా మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిగతావారంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్‌ మ్యాథ్యూస్‌ రెండు సార్లు డకౌటయ్యాడు. బౌలింగ్‌లో మలింగ, నువాన్‌ ప్రదీప్‌లు ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో దూసుకెళుతోంది.

ఒక్క భారత్‌ చేతిలో ఓడిన కంగారూ సేన మూడింట గెలిచి పట్టికలో రెండో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా ఏ రకంగా చూసినా కూడా ఇపుడున్న లంక కంటే టోర్నీ ఫేవరెట్‌ ఆస్ట్రేలియా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. వార్నర్, స్మిత్, ఫించ్, ఖాజా, క్యారీ అందరూ టచ్‌లోకి వచ్చేశారు. జట్టుకు అవసరమైనపుడు కూల్టర్‌ నైల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆదుకుం టున్నాడు. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌ ప్రత్యర్థుల వెన్నువిరుస్తున్నారు. పటిష్టమైన ఫించ్‌ సేనను ఎదుర్కోవాలంటే శ్రీలంక సర్వశక్తులు ఒడ్డాల్సిందే.

ముఖాముఖి...
ఇప్పటివరకు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య 96 మ్యాచ్‌లు జరిగాయి. 60 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలుపొందగా... శ్రీలంకకు ఖాతాలో 32 విజయాలు చేరాయి. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. ఏడు సార్లు ఆస్ట్రేలియాను విజయం వరించగా... ఒకసారి మాత్రమే శ్రీలంక (1996 ఫైనల్లో) గెలిచింది. మరో మ్యాచ్‌ రద్దయింది.  

అవేం పిచ్‌లు... ఇదేం వివక్ష!
‘టోర్నీ ఆడేందుకు వచ్చిన పది దేశాలను సమానంగా చూడాలి. కానీ ఏ విషయంలోనూ మమ్మల్ని అలా చూడట్లేదు. పిచ్, నెట్స్, బస, బస్సు ఇలా అన్నింటా సవతి తల్లి ప్రేమే చూపిస్తున్నారు. మేం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో అన్ని బౌన్సీ వికెట్లే! బ్యాటింగ్‌కు అవకాశమున్న పిచ్‌లే ఇవ్వలేదు. ప్రాక్టీస్‌లోనూ వివక్షే. బస ఏర్పాట్లూ అరకొరే! అందరికీ మూణ్నాలుగు నెట్స్‌ ఇస్తే... మాకు రెండింటితో సరిపెట్టారు. అందరికి సౌకర్యవంతమైన డబుల్‌ డెక్కర్‌ బస్సులిస్తే మాకేమో తక్కువ సీట్లున్న బస్సుతో లాగిస్తున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌ లేని హోటల్లో బస ఏర్పాటు చేశారు. పేసర్లు సేదతీరేందుకు కొలను అవసరం లేదా’ అని శ్రీలంక జట్టు మేనేజర్‌ అశాంత డి మెల్‌ ఐసీసీకి ఫిర్యాదు చేశారు.

జట్లు (అంచనా)
శ్రీలంక: కరుణరత్నే (కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, తిరిమన్నె, కుశాల్‌ మెండిస్, మాథ్యూస్, డిసిల్వా, తిసారా పెరీరా, ఉదాన, లక్మల్, ప్రదీప్, మలింగ. 

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, మార్ష్, క్యారీ, కూల్టర్‌ నైల్, కమిన్స్, స్టార్క్, జంపా.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు