బంగ్లాను ఊరిస్తున్న వందో టెస్టు

19 Mar, 2017 02:17 IST|Sakshi
లక్మల్‌ను వారిస్తున్న రహీమ్‌

లంక ఆధిక్యం 139 పరుగులే
చేతిలో రెండు వికెట్లు  

కొలంబో: వందో టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్‌ను ఫలితం ఊరిస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. బంగ్లా బౌలర్లు ముస్తఫిజుర్‌ రహమాన్‌ (3/52), షకీబుల్‌ హసన్‌ (3/61) రాణించడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. ఓవర్‌నైట్‌ స్కోరు 54/0తో శనివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఓపెనర్‌ కరుణరత్నే (244 బంతుల్లో 126; 10 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు.

కుశాల్‌ మెండీస్‌ (36) పర్వాలేదనిపించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఆట నిలిచే సమయానికి దిల్‌రువాన్‌ పెరీరా (26 బ్యాటింగ్‌), సురంగ లక్మల్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 139 పరుగుల ఆధిక్యంలో ఉన్న లంక చేతిలో ఇంకా రెండే వికెట్లున్నాయి. ఆదివారం ఐదో రోజు టెయిలెండర్లను త్వరగా పెవిలియన్‌ చేర్చితే... తక్కువ లక్ష్యాన్ని బంగ్లా ఛేదించే అవకాశముంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 338 పరుగులు చేయగా, బంగ్లా 467 స్కోరు చేసి 129 పరుగుల ఆధిక్యం పొందింది. నాలుగో రోజు ఆటలో సురంగ, షబ్బీర్‌ రహమాన్, ముష్ఫికర్‌ రహీమ్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు, సహచరులు కలుగచేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు