కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌!

29 Oct, 2018 05:15 IST|Sakshi

రెండు చేతులతో లంక స్పిన్నర్‌ కామిందు మెండిస్‌ బౌలింగ్‌

కొలంబో: శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో క్రికెట్‌ ప్రపంచం ఆశ్చర్యంతో చూసిన ఒక ఘటన జరిగింది. ఇదే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రీలంక స్పిన్నర్‌ పీహెచ్‌డీ కామిందు మెండిస్‌ రెండు చేతులతో బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం ఆటగాడికి లెఫ్టార్మ్‌ స్పిన్‌ వేసిన అతను, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఆఫ్‌ స్పిన్‌ బంతులు విసిరాడు. అతను లెఫ్టార్మ్‌తో వేసిన తొలి బంతికి జేసన్‌ రాయ్‌ సింగిల్‌ తీశాడు. వెంటనే మెండిస్‌ తన బౌలింగ్‌ను మారుస్తున్నట్లు అంపైర్‌కు చెప్పాడు. ఈసారి అతని రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బంతిని స్టోక్స్‌ ఎదుర్కొన్నాడు. మూడు ఓవర్లలో కామిందు వరుసగా 3, 15, 9 పరుగులు ఇచ్చాడు. అతని మూడో ఓవర్లో ఇద్దరు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌లే ఉండటంతో మెండిస్‌కు బౌలింగ్‌ మార్చాల్సిన అవసరం లేకపోయింది.  

అంతర్జాతీయ సీనియర్‌ స్థాయి క్రికెట్‌లో ఒక బౌలర్‌ ఇలా రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. దేశవాళీ క్రికెట్‌లో అక్షయ్‌ కర్నేవర్‌ (భారత్‌), జెమా బార్స్‌బై (ఆస్ట్రేలియా)లాంటి కొందరు ఉన్నా జాతీయ జట్టు తరఫున ఇలాంటి బౌలింగ్‌ శైలి (ఆంబిడెక్స్‌ట్రస్‌) ఎవరికీ లేదు. గతంలో హనీఫ్‌ మొహమ్మద్, గ్రాహం గూచ్, హసన్‌ తిలకరత్నే ఇలాంటి ఫీట్‌ను ప్రదర్శించినా అదంతా సరదాకు మాత్రమే! సీరియస్‌గా బౌలింగ్‌ చేసే ఒక రెగ్యులర్‌ బౌలర్‌కు ఇలా రెండు చేతులతో బంతులు వేయగల సత్తా ఉండటం మాత్రం కచ్చితంగా విశేషమే. బ్యాట్స్‌మెన్‌కు అనుగుణంగా ఒకే ఓవర్లో బౌలింగ్‌ మార్చుకోగలడం జట్టుకు అదనపు బలం కూడా కాగలదు. శ్రీలంక అండర్‌–19 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన 20 ఏళ్ల కామిందు మెండిస్‌ బ్యాటింగ్‌లో మాత్రమే ఎడంచేతి వాటమే.

మరిన్ని వార్తలు