19 ఏళ్ల ప్రస్థానం ముగించి...

6 Nov, 2018 03:09 IST|Sakshi

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తర్వాత రిటైర్‌ కానున్న రంగన హెరాత్‌   

1999 సెప్టెంబర్‌ 22–26... రంగన హెరాత్‌ తన తొలి టెస్టు ఆడిన తేదీలు. గత 19 ఏళ్లుగా అతను అలసట లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో వేల సంఖ్యలో బంతులు వేస్తూనే ఉన్నాడు. కొత్త మిలీనియం ప్రారంభానికి ముందు అరంగేట్రం చేసి ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌ ఆడుతున్నవారిలో హెరాత్‌ ఆఖరివాడు. ఒకనాడు మురళీధరన్‌ నీడలోనే ఉండిపోయిన అతను, మురళీధరన్‌ తప్పుకున్న తర్వాత తనదైన ప్రత్యేకత కనబర్చి శ్రీలంక క్రికెట్‌లో ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నాడు. నేటి నుంచి గాలేలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు 40 ఏళ్ల హెరాత్‌ ముదియన్‌సెలగే రంగన కీర్తి బండార (హెచ్‌ఎంఆర్‌కేబీ) హెరాత్‌కు ఆఖరి టెస్టు మ్యాచ్‌ కానుంది.   

సాక్షి క్రీడా విభాగం  : శ్రీలంక జట్టులో మురళీధరన్‌ ఉన్నంత వరకు 22 టెస్టులు 37.88 సగటుతో హెరాత్‌ కేవలం 71 వికెట్లు పడగొట్టాడు. రెండో స్పిన్నర్‌గా జట్టులో కొనసాగుతున్నా, కొన్ని అద్భుత ప్రదర్శనలు ఉన్నా అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కచ్చితత్వంతో సుదీర్ఘ స్పెల్‌ల పాటు బౌలింగ్‌ చేసి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచడమే అతని పనిగా ఉండేది. ఇలాంటి స్థితిలో టన్నులకొద్దీ వికెట్లు మాత్రం మురళీ ఖాతాలోకి వెళ్లిపోయేవి. అయితే ఏనాడూ తన అసంతృప్తిని ప్రదర్శించని రంగన... మురళీ తప్పుకున్న తర్వాత తనెంత విలువైన ఆటగాడినో చూపిస్తూ చెలరేగిపోయాడు. ఆ తర్వాత ఆడిన 70 టెస్టుల్లో కేవలం 26 సగటుతో ఏకంగా 359 వికెట్లు తీయడం హెరాత్‌ స్వయంప్రకాశాన్ని చూపిస్తుంది.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 10వ స్థానంలో (430 వికెట్లు) ఉన్న హెరాత్‌ ఎడంచేతి వాటం వారిలో అత్యంత విజయవంతమైన బౌలర్‌ కావడం విశేషం. తొలి పదేళ్లలో 14 టెస్టులు మాత్రమే దక్కడంతో దాదాపు కెరీర్‌ ముగిసిపోయిన దశలో ఇంగ్లండ్‌లో మైనర్‌ లీగ్‌లు ఆడుకునేందుకు హెరాత్‌ వెళ్లిపోయాడు. అలాంటి స్థితిలో 31 ఏళ్ల వయసులో 2009లో అనూహ్యంగా వచ్చిన మరో అవకాశంతో హెరాత్‌ జట్టులో పాతుకుపోయాడు. తన సత్తాను ప్రదర్శిస్తూ జట్టులో కొనసాగగలిగాడు. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాతే అతను 230 వికెట్లు తీయడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఇతర బౌలర్లతో పోలిస్తే హెరాత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం నాలుగో ఇన్నింగ్స్‌లో అతను తీసిన వికెట్ల సంఖ్య.

చివరి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని పడగొట్టి మ్యాచ్‌ను గెలిపించడంలో తనకెవరూ సాటి రారన్నట్లుగా హెరాత్‌ ఏకంగా 12 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న మురళి 7 సార్లే ఆ ఘనత నమోదు చేయగలిగాడు! దీనిపై స్పందిస్తూ ‘అవన్నీ సొంతగడ్డపై స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లు. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్‌లో బంతి బాగా టర్న్‌ అవుతుంది. రికార్డులకు పిచ్‌లు కూడా కారణం’ అంటూ చెప్పుకోవడం హెరాత్‌కే చెల్లింది.

శ్రీలంకలోనే కాకుండా 2011లో డర్బన్‌లో అద్భుత బౌలింగ్‌తో 9 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గడ్డపై లంక తొలి టెస్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడం అతని కెరీర్‌లో చిరస్మరణీయ జ్ఞాపకం. ఘనతలపరంగా చూస్తే కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకపోయినా, స్టార్‌ బౌలర్‌గా గుర్తింపు లేకపోయినా తన పనేంటో తాను చేసుకుంటూ పోయిన హెరాత్‌ వివాదాలకు దూరంగా ఆటకు గుడ్‌బై చెబుతున్నాడు. తాను తొలి టెస్టు ఆడిన, బాగా అచ్చొచ్చిన గాలే మైదానంలో (99 వికెట్లు)     చివరి టెస్టులో హెరాత్‌ మరో ఐదు వికెట్లు తీస్తే హ్యాడ్లీ, బ్రాడ్, కపిల్‌లను దాటి ఏడో స్థానంతో కెరీర్‌ ముగిస్తాడు.    

శ్రీలంక గీ ఇంగ్లండ్‌; తొలి టెస్టు (గాలే) ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

మరిన్ని వార్తలు