తీవ్ర గాయం చేసిన ‘సూపర్‌’ ప్రాక్టీస్‌

17 Feb, 2020 10:53 IST|Sakshi

అడిలైడ్‌: త్వరలో జరుగనున్న టీ20 మహిళా వరల్డ్‌కప్‌లో భాగంగా ఓ వార్మప్‌ మ్యాచ్‌లో శ్రీలంక వుమెన్స్‌ క్రికెటర్‌ అచిన కులసురియా తీవ్రంగా గాయపడింది. తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను స్ట్రైచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.  ఆదివారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు తలపడ్డాయి. దీనిలో భాగంగా లాంగాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కులసురియా... దక్షిణాఫ్రికా క్రీడాకారిణి ట్రయాన్‌ కొట్టిన బంతిని అంచనా వేయడంలో తప్పుగా అంచనా వేయడంతో అది కాస్తా వచ్చి నేరుగా తలపై పడింది. (ఇక్కడ చదవండి: భారత్, పాక్‌ మహిళల టి20 మ్యాచ్‌ రద్దు)

దాంతో చాలాసేపు అలాగే మోకాళ్లపై కూలబడిపోయిన కులసురియా విలవిల్లాడిపోయింది. ఆ క‍్రమంలోనే మొదట ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేశారు. తొలుత దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలిచినప్పటికీ,  ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ కోసం సూపర్‌ ఓవర్‌ ఆడిస్తుండగా కులసురియా గాయపడటం కలకలం రేపింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్‌ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు..  ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది. 

మరిన్ని వార్తలు