సెమీస్‌లో శ్రీకాంత్‌

16 Nov, 2019 05:00 IST|Sakshi

తొలి గేమ్‌ కోల్పోయాక గాయంతో వైదొలిగిన చెన్‌ లాంగ్‌

హాంకాంగ్‌ ఓపెన్‌ టోర్నీ

హాంకాంగ్‌: అదృష్టం కలిసి వస్తుండటంతో... హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ రియో ఒలింపిక్స్‌ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ను శ్రీకాంత్‌ 21–13తో గెలిచిన తర్వాత... గాయం కారణంగా చెన్‌ లాంగ్‌ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. ఓవరాల్‌గా చెన్‌ లాంగ్‌పై శ్రీకాంత్‌కిది రెండో విజయం. గతంలో ఆరుసార్లు చెన్‌ లాంగ్‌ చేతిలో శ్రీకాంత్‌ ఓడిపోయాడు. ఈ ఏడాది మార్చిలో ఇండియా ఓపెన్‌ టోర్నీలో సెమీస్‌ చేరిన తర్వాత శ్రీకాంత్‌ మరో టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ దశను అధిగమించడం ఇదే తొలిసారి.

నేడు జరిగే సెమీఫైనల్లో లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌)తో ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్‌ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో లీ చెయుక్‌ యియు 21–14, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)పై సంచలన విజయం సాధించాడు. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో శ్రీకాంత్‌ తలపడాల్సింది. అయితే మొమోటా టోర్నీ నుంచి వైదొలగడంతో శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లో వాకోవర్‌ లభించింది. మొమోటా చేతిలో శ్రీకాంత్‌ ఇప్పటివరకు 12 సార్లు ఓడిపోయి, మూడుసార్లు గెలిచాడు. శ్రీకాంత్‌ చివరిసారి మొమోటాపై 2015లో గెలుపొందడం గమనార్హం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా