సీకే నాయుడు అవార్డుకు ఎంపికైన శ్రీకాంత్, అంజుమ్‌ చోప్రా

28 Dec, 2019 03:10 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఈ ఏడాదికి గానూ భారత దిగ్గజ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్, భారత మహిళల జట్టు మాజీ సారథి అంజుమ్‌ చోప్రాలు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును వచ్చే నెల 12వ తేదీన ముంబైలో జరిగే బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఇవ్వనుంది. వీరిద్దరూ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ వారిని సీకే నాయుడు అవార్డుతో సత్కరిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైకు చెందిన శ్రీకాంత్‌... భారత్‌కు 1981–1992 మధ్య ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2062 పరుగులు, 146 వన్డేల్లో 4091 పరుగులు చేసిన ఈ 60 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌... భారత్‌ 1983లో తొలిసారి ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు సభ్యుడు. అంతేకాకుండా అతను చీఫ్‌ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే భారత్‌ 2011లో రెండోసారి ప్రపంచ కప్‌ను గెల్చుకోవడం విశేషం. 1989లో ఇతని సారథ్యంలోనే సచిన్‌ టెండూల్కర్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 42 ఏళ్ల అంజుమ్‌ చోప్రా తన కెరీర్‌లో 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టి20లు ఆడింది.  

మరిన్ని వార్తలు