క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, సౌరభ్‌

29 Nov, 2019 05:09 IST|Sakshi

సాయిప్రణీత్, ప్రణయ్‌ ఔట్‌

సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ టోర్నీ

లక్నో: మాజీ చాంపియన్‌ కిడాంబి శ్రీకాంత్‌ సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 300’ ఈవెంట్‌లో సౌరభ్‌ వర్మ కూడా ముందంజ వేయగా... మిగతా భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌తో పాటు హెచ్‌.ఎస్‌.ప్రణయ్, అజయ్‌ జయరామ్, పారుపల్లి కశ్యప్‌ నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్లు టోర్నీకి దూరం కాగా... క్వాలిఫయర్లు రీతుపర్ణా దాస్, శ్రుతి ముందాడ క్వార్టర్స్‌ చేరారు. డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగింది.

శ్రమించిన శ్రీకాంత్‌ 
పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 18–21, 22–20, 21–16తో తన సహచరుడు పారుపల్లి కశ్యప్‌ను ఓడించాడు. 2016లో టైటిల్‌ నెగ్గిన శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌లోనూ ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడినప్పటికీ శ్రీకాంత్‌ పుంజుకొని ఆడటంతో రెండు, మూడో గేమ్‌ల్లో గెలిచి మ్యాచ్‌ నెగ్గాడు.. మరో మ్యాచ్‌లో సౌరభ్‌ వర్మ కూడా భారత ఆటగాడిపైనే గెలిచి క్వార్టర్స్‌ చేరాడు. అతను 21–11, 21–18తో ఆలాప్‌ మిశ్రాను ఓడించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌... ఏడో సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)తో తలపడతాడు. సన్‌ వాన్‌ 21–14, 21–17తో లక్ష్యసేన్‌ను ఓడించాడు. సౌరభ్‌... కున్లవుత్‌ వితిద్సర్న్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడతాడు. సిరిల్‌ వర్మ 9–21, 22–24తో హి క్వాంగ్‌ హీ (కొరియా) చేతిలో కంగుతిన్నాడు.

పోరాడి ఓడిన అజయ్‌ 
మిగతావారిలో ఒక్క అజయ్‌ జయరామ్‌ మాత్రమే తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లో  ఓడినప్పటికీ చైనా గోడ... జావో జన్‌ పెంగ్‌ను దీటుగా ఢీకొట్టాడు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో అజయ్‌ 18–21, 21–14, 28–30తో ఓటమి పాలయ్యాడు. ఈ సీజన్‌లో నిలకడైన విజయాలతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు సాయిప్రణీత్‌ రెండోరౌండ్లోనే చేతులెత్తేశాడు. అతను 11–21, 17–21తో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్‌ వితిద్సర్న్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 21–14, 10–21, 14–21తో ఎనిమిదో సీడ్‌ వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు.

రీతుపర్ణా క్వార్టర్స్‌కు... 
మహిళల సింగిల్స్‌లో రీతుపర్ణా దాస్‌ 21–16, 21–13తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్‌ తన్వీలాడ్‌ను ఇంటిదారి పట్టించింది. మరో మ్యాచ్‌లో శ్రుతి 21–18, 21–14తో బెల్జియం క్రీడాకారిణి లియానే తన్‌పై గెలిచింది. మరో క్వాలిఫయర్‌ అష్మిత 12–21, 16–21తో కిమ్‌ హో మిన్‌ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్‌ రెండో రౌండ్లో క్లొయె బిర్చ్‌–లారెన్‌ స్మిత్‌ (ఇంగ్లండ్‌) జంటతో జరిగిన మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 0–2తో వెనుకబడిన దశలో రిటైర్ట్‌హర్ట్‌గా నిష్క్రమించింది. కె.మనీషా–రుతుపర్ణ పండా జంట 9–21, 10–21తో నాలుగో సీడ్‌ చాంగ్‌ యి న– కిమ్‌ హి రిన్‌ (కొరియా) ద్వయం చేతిలో ఓడింది.

మరిన్ని వార్తలు