గుంటూరు డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీకాంత్‌

20 Apr, 2018 01:30 IST|Sakshi

నియామక పత్రాలు 

అందజేసిన సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ 

గొల్లపూడి(విజయవాడ రూరల్‌): భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియామక పత్రాలు అందుకున్నాడు. గత ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు కూడా చేరుకున్న శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలోనే డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. గురువారం గొల్లపూడిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనిల్‌ చంద్ర పునీత ఈ స్టార్‌ షట్లర్‌కు నియామక పత్రాలు అందజేశారు. శ్రీకాంత్‌ స్పందిస్తూ... ‘రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమించడం ఆనందంగా ఉంది. దీనికి నా కృతజ్ఞతలు’ అని అన్నాడు.  

నంబర్‌వన్‌ నుంచి ఐదో స్థానానికి... 
భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ వారం రోజుల ముచ్చటే అయింది. గురువారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌ ఐదో స్థానానికి పడిపోయాడు. గత వారం శ్రీకాంత్‌ తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. 2017 సింగపూర్‌ సిరీస్‌లో ఫైనల్‌ చేరడం ద్వారా పొందిన 7800 పాయింట్లను ఇప్పుడు  కోల్పోవడంతో  శ్రీకాంత్‌ ర్యాంక్‌లో మార్పు వచ్చింది. భారీగా పాయింట్లు చేజారడంతో అతను నాలుగు స్థానాలు కోల్పోయాడు. ఇదే టోర్నీలో విజేతగా నిలిచిన మరో తెలుగు తేజం సాయిప్రణీత్‌ 9200 పాయింట్లు కోల్పోవడంతో నాలుగు స్థానాలు దిగజారి 19వ స్థానంలో నిలిచాడు. ఆ సిరీస్‌లో పాల్గొనని హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌ 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌) మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడో స్థానంలో, సైనా నెహ్వాల్‌ 12వ స్థానంలోనే కొనసాగుతుండగా... యామగుచి (జపాన్‌) అగ్రస్థానం దక్కించుకుంది. 

మరిన్ని వార్తలు