శ్రీకాంత్‌కు నిరాశ

30 Nov, 2019 00:39 IST|Sakshi

క్వార్టర్స్‌లోనే ఓడిన మాజీ నంబర్‌వన్‌

సెమీస్‌లో సౌరభ్‌ వర్మ, రితూపర్ణ

లక్నో: భారత స్టార్‌ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ 2019 సీజన్‌ను ఒక్క టైటిల్‌ నెగ్గకుండానే ముగించాడు. ఈ ఏడాది చివరి వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌ సయ్యద్‌ మోదీ ఓపెన్‌లో శ్రీకాంత్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 18–21, 19–21తో ప్రపంచ 43వ ర్యాంకర్‌ సన్‌ వాన్‌ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. సన్‌ వాన్‌ హోతో 11 సార్లు తలపడిన శ్రీకాంత్‌ ఏడుసార్లు ఓడిపోవడం గమనార్హం.

మరోవైపు జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో సౌరభ్‌ 21–19, 21–16తో గతంలో మూడుసార్లు ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచిన కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి రితూపర్ణ దాస్‌ 24–26, 21–10, 21–19తో భారత్‌కే చెందిన శ్రుతి ముందాడపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో ఫిట్టాయపోర్న్‌ చైవాన్‌ (థాయ్‌లాండ్‌)తో రితూపర్ణ దాస్‌; హివో క్వాంగ్‌ హీ (దక్షిణ కొరియా)తో సౌరభ్‌ వర్మ తలపడతారు.

మరిన్ని వార్తలు