ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్

5 Dec, 2015 18:05 IST|Sakshi
ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్
మలాంగ్: ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్, ఇండోనేసియా రైజింగ్ స్టార్ జిన్‌టింగ్ ఆంథోనీపై 21-13, 21-19 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు. తాను ఆడిన గత ఆరు టోర్నమెంట్లలో ఐదింట్లో తొలి రౌండ్లోనో ఇంటి దారి పట్టిన శ్రీకాంత్.. ఈ మ్యాచ్లో స్థానిక ఆటగాడిని కేవలం 37 నిమిషాల్లోనే వరుస సెట్లలో మట్టికరిపించాడు. తొలి సెట్ ను సులువుగా కైవసం చేసుకున్న శ్రీకాంత్కు రెండో సెట్లో ప్రత్యర్థి జిన్టింగ్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అయితే, మ్యాచ్ పాయింట్ గెలుచుకుని సెట్తో పాటు మ్యాచ్ను గెలుచుకున్నాడు. 
 
టామీ సుగియార్టో, విస్ణు యులి ప్రసెట్టో మధ్య జరిగే మరో సెమీస్ మ్యాచ్ విన్నర్తో ఫైనల్లో భారత టాప్ షట్లర్ శ్రీకాంత్ తలపడనున్నాడు. టైటిల్ పోరులోనూ స్థానిక ఆటగాడే శ్రీకాంత్కు ప్రత్యర్థిగా బరిలో ఎదురుకానున్నాడు. మొత్తానికి ఈ ఏడాది శ్రీకాంత్కు ఇది నాల్గో గ్రాండ్ టోర్నమెంట్ ఫైనల్. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్స్ సొంతం చేసుకోగా.. ఇండియా గ్రాండ్ ప్రి టోర్నమెంటులో ఫైనల్లో ఓటమి చవిచూసిన విషయం అందరికీ విదితమే.
>
మరిన్ని వార్తలు