విజయం దిశగా కివీస్

21 Dec, 2015 01:27 IST|Sakshi
విజయం దిశగా కివీస్

హామిల్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం దిశగా పయనిస్తోంది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం మూడోరోజు బరిలోకి దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. విలియమ్సన్ (78 బ్యాటింగ్), వాట్లింగ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి మరో 47 పరుగులు చేస్తే సరి. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు లాథమ్ (4), గప్టిల్ (1) విఫలమైనా... విలియమ్సన్, టేలర్ (35) మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

మెకల్లమ్ (18), సాంట్నెర్ (4) నిరాశపర్చారు. చమీరాకు 4 వికెట్లు పడ్డాయి. కుప్పకూలిన లంక: అంతకుముందు 232/9 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. దీంతో లంకకు 55 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మ్యాథ్యూస్ సేన ఊహించని రీతిలో కుప్పకూలింది.

సౌతీ (4/26), వాగ్నెర్ (3/40), బ్రాస్‌వెల్ (2/31) ధాటికి 36.3 ఓవర్లలో కేవలం 133 పరుగులకే చేతులెత్తేసింది. మెండిస్ (46) టాప్ స్కోరర్. కివీస్ బౌలింగ్ ధాటికి ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 71 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన లంక... మరో 62 పరుగుల తేడాలో మొత్తం పది వికెట్లు చేజార్చుకుంది.

>
మరిన్ని వార్తలు