అఫ్గాన్‌ లక్ష్యం 187

4 Jun, 2019 20:55 IST|Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 201 పరుగులకు ఆలౌటైంది. కుశాల్‌ పెరీరా(78) హాఫ్‌ సెంచరీ సాధించగా, కెప్టెన్‌ దిముత​ కరుణరత్నే(30), లహిరు తిరుమన్నే(25)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌కు వరుణడు ఆటంకం కల్గించడంతో 41 ఓవర్లకు కుదించారు. దాంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం అఫ్గాన్‌కు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీలంక జట్టు 33 ఓవర్లులో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల వద్ద ఉండగా ఆకస్మాత్తుగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌కు దాదాపు మూడు గంటల అంతరాయం కల్గింది. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన కాసేపటికి లసిత్‌ మలింగా తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,  నువాద్‌ ప్రదీప్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో శ్రీలంక 36.5 ఓవర్లలో 201 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌​ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా,  తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్‌ స్పిన్నర్‌ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది.

అఫ్గాన్‌ స్పిన్నర్‌ మహ్మద్‌ నబీ వేసిన 22 ఓవర్‌లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్‌ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్‌ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్‌ మెండిస్‌(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్‌(0)ను పెవిలియన్‌కు చేర్చాడు.  ఆపై హమిద్‌ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్‌ కాగా, తిషారా పెరీరా(2) కూడా నిరాశపరిచాడు. ఇక బాధ్యతాయుతంగా ఆడిన కుశాల్‌ పెరీరా(78)  ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. కుశాల్‌ పెరీరా ఔటైన తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మ్యాచ్‌ ఆరంభమయ్యాక లంక మరో 19 పరుగులు చేసి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. అఫ్గాన్‌ బౌలర్లలో మహ్మద్‌ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్‌ ఖాన్‌, దావ్లాత్‌ జద్రాన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. హమిద్‌ హసన్‌కు వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు