లంకకు సాధ్యమేనా!

14 Nov, 2017 00:09 IST|Sakshi

భారత గడ్డపై తొలి విజయం కోసం 35 ఏళ్లుగా నిరీక్షణ

ఆడిన 17 టెస్టుల్లో 10 పరాజయాలే   

దులీప్‌ మెండిస్, అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా... మురళీధరన్, సనత్‌ జయసూర్య, మహేల జయవర్ధనే, సంగక్కర... నాటి తరం నుంచి నేటి తరం వరకు శ్రీలంక క్రికెట్‌లో వీరంతా దిగ్గజాలు. ఈ ఆటగాళ్లంతా ఏదో ఒక దశలో భారత్‌లో టెస్టు సిరీస్‌లు ఆడారు. కానీ విజయం సాధించిన జట్టులో భాగమయ్యే అవకాశం మాత్రం రాలేదు. కొన్ని సార్లు పోరాటస్ఫూర్తితో మ్యాచ్‌లను కాపాడుకోగలిగినా... గెలుపు మాత్రం అందని ద్రాక్షే అయ్యింది. ఇప్పుడు మరోసారి లంక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చిన లంక యువ జట్టు ఏ మాత్రం సత్తా చాటుతుందనేది ఆసక్తికరం.  

సాక్షి క్రీడా విభాగం :శ్రీలంక జట్టు భారత గడ్డపై ఆఖరి సారిగా 2009లో టెస్టు సిరీస్‌ ఆడింది. తొలి టెస్టులో జయవర్ధనే అసమాన బ్యాటింగ్‌ (275)తో ఆ జట్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగింది. అయితే తర్వాతి రెండు టెస్టుల్లో మాత్రం చిత్తుగా ఓడి సిరీస్‌ను కోల్పోయింది. జయవర్ధనే, సంగక్కర, సమరవీర, దిల్షాన్‌లాంటివాళ్లు కూడా భారత బౌలింగ్‌ ముందు తేలిపోగా... కెరీర్‌ చరమాంకంలో ఉన్న మురళీధరన్‌ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. నాటి సిరీస్‌ ఆడిన జట్టు సభ్యులలో ఇద్దరు మాత్రమే ఇప్పుడు మళ్లీ భారత్‌కు వచ్చారు. ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్, సీనియర్‌ స్పిన్నర్‌ రంగన హెరాత్‌ కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయనున్నారు. కెప్టెన్‌ చండిమాల్‌ కూడా తొలిసారి భారత గడ్డపై బరిలోకి దిగుతున్నాడు. ఇటీవలే సొంత గడ్డపైనే చిత్తుగా ఓడిన లంక, దాదాపు అదే భారత జట్టును నిలువరించి సంచలనం సృష్టించడం అంత సులువు కాదు.  

సీనియర్లు ఏం చేయగలరు?
కొన్నాళ్ల క్రితం వరకు కూడా మాథ్యూస్‌కు ప్రపంచ క్రికెట్‌లోని ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు ఉంది. అయితే రాన్రానూ కళ తప్పిన అతను ఒక దశలో జట్టుకు భారంగా మారాడు. వరుస గాయాలతో చాలా వరకు అతను బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇక బ్యాటింగ్‌  కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు మినహా మిగతా ఐదు ఇన్నింగ్స్‌లలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక అర్ధ సెంచరీ చేసి మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌లలో చెత్త ప్రదర్శన కనబర్చాడు. మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషించాల్సిన ప్రధాన బ్యాట్స్‌మన్‌ అయి ఉండీ మాథ్యూస్‌ గత 17 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. గాయం కారణంగా ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్‌ నుంచి పూర్తిగా తప్పుకున్న అతను... ఇప్పుడు కోలుకొని పునరాగమనం చేస్తున్నాడు. ఈ స్థితిలో అతను రాణించడం ఎంతో ముఖ్యం. మరోవైపు వెటరన్‌ హెరాత్‌ ఫామ్‌ మాత్రం లంక జట్టులో ఆశలు రేపుతోంది. పాకిస్తాన్‌పై రెండో టెస్టులో 11 వికెట్లతో చెలరేగిన హెరాత్, అంతకు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై కూడా తన పదును చూపించాడు. అయితే భారత్‌పై హెరాత్‌ రికార్డు మాత్రం పేలవంగానే ఉంది. భారత్‌పై ఆడిన 9 టెస్టుల్లో 32 వికెట్లు మాత్రమే తీసిన హెరాత్‌... తన కెరీర్‌లో అతి చెత్త సగటు (45.96) కూడా భారత్‌పైనే నమోదు చేశాడు. అయితే స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ తయారైతే మాత్రం మన బ్యాట్స్‌మెన్‌ను కచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు.  

కుర్రాళ్లకు సవాల్‌!
పాక్‌పై ఇటీవల 2–0తో సాధించిన టెస్టు సిరీస్‌ విజయం శ్రీలంక ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కొంత మంది యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ కరుణరత్నే అత్యధిక స్కోరు 196తో సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చండిమాల్‌ కూడా సెంచరీతో చెలరేగగా... డిక్‌వెలా కూడా చక్కటి ప్రదర్శన కనబర్చి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో సీనియర్‌ హెరాత్‌ మాత్రమే కాకుండా ఆఫ్‌ స్పిన్నర్‌ దిల్‌రువాన్‌ పెరీరా 12 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. స్పిన్‌ను సమర్థంగా ఆడగల పాక్‌ను కట్టడి చేయడంలో లక్మల్, గమగే కూడా సఫలమయ్యారు. ఇప్పుడు వీరంతా అదే స్ఫూర్తి, పట్టుదలతో భారత్‌లో కూడా రాణించాలని భావిస్తున్నారు. భారత్‌ దుర్భేద్యమైన జట్టు అనడంలో సందేహం లేదు. అయితే ఒక్క రోజు, ఒక్క సెషన్‌లో తమకు పరిస్థితి అనుకూలంగా మారినా... దానిని సద్వినియోగం చేసుకోగలిగితే యువ లంక జట్టు ఈ సిరీస్‌ను చిరస్మరణీయం చేసుకోగలదు.

మరిన్ని వార్తలు