టీమిండియా బౌలర్ల విజృంభణ

20 Nov, 2017 15:29 IST|Sakshi

కోల్ కతా:శ్రీలంకతో తొలి టెస్టులో భారత బౌలర్ల విజృంభణ కొనసాగుతోంది. 231 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన శ్రీలంక టాపార్డర్ ను  టీమిండియా కకావికలం చేసింది. 22 పరుగులకే నాలుగు లంక వికెట్లను పడగొట్టిన భారత జట్టు పైచేయి సాధించింది.  లంక ఓపెనర్లలో సమరవిక్రమ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరగా, కరుణరత్నే(1) సైతం నిరాశపరిచాడు. ఆపై తిరుమన్నే(7), మాథ్యూస్(12)లు పెవిలియన్ కు చేరారు. ఈ నాలుగు వికెట్లలో రెండు భువనేశ్వర్ కుమార్  సాధించగా, షమీ, ఉమేశ్ యాదవ్ లు తలో వికెట్ తీశారు.


కోహ్లి శతకం సాధించిన తరువాత భారత తన రెండో ఇన్నింగ్స్ ను 352/8 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో  భారత్ కు 230 పరుగుల ఆధిక్యం లభించింది. కోహ్లి(104 నాటౌట్) శతకం సాధించి భారత్ కు  గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సహకరించాడు. సోమవారం 171/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాకిచ్చాడు లక్మల్.తొలుత కేఎల్ రాహుల్(79;125 బంతుల్లో8 ఫోర్లు) ను అవుట్ చేసిన లక్మల్..కాసేపటికి చతేశ్వర పుజారా(22), అజింక్యా రహానే(0)లను వరసు బంతుల్లో అవుట్ చేశాడు. 21 పరుగుల వ్యవధిలో ముగ్గరు టాపార్డర్ ఆటగాళ్లను లక్మల్ అవుట్ చేసి లంక శిబిరంలో ఆనందం నింపాడు.  ఇక రవీంద్ర జడేజా(9) వికెట్ ను పెరీరా సాధించాడు. కాగా, కోహ్లి మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తే ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లి..ఆపై దాన్ని సెంచరీగా మలచుకున్నాడు.

మరిన్ని వార్తలు