దూకుడుగా ఆడుతున్న శ్రీలంక

15 Jun, 2019 20:19 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. లంకేయులు 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 112 పరుగులు చేసి ధీటుగా బదులిస్తున్నారు. లంక ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే, కుశాల్‌ పెరీరాలు హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఒకవైపు కరుణరత్నే సమయోచితంగా ఆడుతుంటే, కుశాల్‌ పెరీరా మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. ఆది నుంచి విజృంభించి ఆడటంతో ఆసీస్‌ బౌలర్లు చెమటోడ్చుతున్నారు.

అంతకుముందు అరోన్‌ ఫించ్‌(153; 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీకి తోడు స్టీవ్‌ స్మిత్‌(73; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), మ్యాక్స్‌వెల్‌(46 నాటౌట్‌; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)ల ఆసీస్‌ 335 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ ఆరంభంలో కుదురుగా ఆడింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌-అరోన్‌ ఫించ్‌లు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్‌(26) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై ఖవాజా(10) కూడా నిరాశపరచడంతో ఆసీస్‌ 100 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో ఫించ్‌కు జత కలిసిన స్టీవ్‌ స్మిత్‌ తన సొగసైన ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలోనే ముందుగా ఫించ్‌ హాఫ​ సెంచరీ పూర్తి చేసుకోగా, కాసేపటికి స్మిత్‌ కూడా అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలు సాధించిన తర్వాత ఆసీస్‌ స్కోరులో వేగం పుంజుకుంది. ప్రధానంగా ఫించ్‌ హార్డ్‌ హిట్టింగ్‌తో విరుచుపడితే, స్మిత్‌ చక్కటి టైమింగ్‌తో పరుగులు రాబట్టాడు.  ఈ జోడి మూడో వికెట్‌కు 173 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత ఫించ్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. మరో ఐదు పరుగుల వ్యవధిలో స్మిత్‌ సైతం ఔట్‌ కావడంతో ఆసీస్‌ 278 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది. ఆ సమయంలో మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. వచ్చీ రావడంతో బౌండరీలే లక్ష్యంగా బ్యాట్‌ ఝుళిపించాడు. కాగా, చివర్లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడమే కాకుండా ఫీల్డింగ్‌ కూడా మెరుపులు మెరింపించడంతో ఆసీస్‌ స్కోరు మందగించింది. దాంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 334 పరుగుల చేసింది.


 

మరిన్ని వార్తలు