ఇంగ్లండ్‌కు ఎదురుందా?

21 Jun, 2019 14:56 IST|Sakshi

లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగనున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఫామ్‌ను చూస్తే ఆ జట్టును ఓడించడం శ్రీలంకకు కష్టమే. లంకేయులు సమిష్టగా రాణిస్తే తప్ప ఇంగ్లండ్‌ను నిలువరించడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. ఒకవైపు భారీ స్కోరు సాధిస్తునే ప్రత్యర్థి జట్లను కట్టడి చేసే తీరు అద్భుతంగా ఉంది. దాంతో తాజా మ్యాచ్‌లో ఇంగ్లండ్‌నే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా టోర్నీలో లంక జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి.. రెండింటిలో ఓడింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో లంక 4 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది.

సెమీస్‌ చేరాలంటే లంకేయులు తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై నెగ్గి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కరుణరత్నే సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్‌ వైఫల్యం లంకను వేధిస్తోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్‌లో మెరుగుపడి భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉంది. కాగా, ఇరు జట్లు ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో తలపడగా లంక 35 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంగ్లండ్‌ 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ ‘టై’ కాగా, రెండింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 10 మ్యాచ్‌లకుగాను నాలుగింట్లో లంక, ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచాయి.

తుది జట్లు

శ్రీలంక
దిముత్‌ కరుణరత్నే(కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఏంజెలో మాథ్యూస్‌, తిషారా పెరీరా, జీవన్‌ మెండిస్‌, ధనంజయ డిసిల్వా,  ఇసురు ఉదాన, లసిత్‌ మలింగా, నువాన్‌ ప్రదీప్‌

ఇంగ్లండ్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేమ్స్‌ విన్సే, జోనీ బెయిర్‌ స్టో, జో రూట్‌, జోస్‌ బట్లర్‌,  బెన్‌ స్టోక్స్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్‌,  జోఫ్రా ఆర్చర్‌,  మార్క్‌వుడ్‌


 

మరిన్ని వార్తలు