శ్రీనివాసన్ హామీ ఇచ్చారు

5 Feb, 2014 01:19 IST|Sakshi

కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య త్వరలో ద్వైపాక్షిక సిరీస్ జరగనుందా! అవుననే అంటున్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ జకా అష్రాఫ్. తటస్థ వేదికపై తమతో సిరీస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అంగీకారం తెలిపారని చెబుతున్నారు. ఈ మేరకు జనవరిలో జరిగిన ఐసీసీ సమావేశం సందర్భంగా శ్రీనివాసన్ తమకు హామీ ఇచ్చినట్లు అష్రాఫ్ తెలిపారు. ఐసీసీలో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల ఆధిపత్యం కోసం రూపొందించిన నూతన విధానానికి మద్దతు పొందేందుకే శ్రీనివాసన్ ద్వైపాక్షిక సిరీస్‌ను ముందుకు తెచ్చారన్న అభిప్రాయం ఉన్నా, బీసీసీఐ వైఖరి మాత్రం సానుకూలంగానే కనిపిస్తోందన్నారు.

 వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాం
 ఐసీసీలో ఆధిపత్యం కోసం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ప్రతిపాదిస్తున్న విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పీసీబీ చైర్మన్ అఫ్రాఫ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశమైన తమ గవర్నింగ్ బోర్డు.. పీసీబీ చీఫ్ ప్యాట్రన్ అయిన ప్రధానిని కలిసి సలహా కోరాల్సిందిగా తనకు సూచించిందని తెలిపారు. అయితే ఈ విషయంలో తాము కొంత మెత్తబడినట్లు వార్తలు వస్తున్నా.. అంతిమంగా పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాలే లక్ష్యంగా తమ నిర్ణయం ఉంటుందని అఫ్రాఫ్ స్పష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు