'వావ్‌'రింకా

13 Sep, 2016 01:28 IST|Sakshi
'వావ్‌'రింకా

కొన్నేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వచ్చిందంటే జొకోవిచ్, ఫెడరర్, నాదల్, ముర్రేలను టైటిల్ ఫేవరెట్స్‌గా పరిగణించడం ఆనవాయితీగా వస్తోంది. గత 47 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో ఈ నలుగురే 43 టైటిల్స్‌ను పంచుకోవడం వారి ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఇక నుంచి ఆ నలుగురితోపాటు వావ్రింకాను కూడా కచ్చితమైన ఫేవరెట్స్ జాబితాలో పరిగణించే సమయం వచ్చేసింది.  ఇన్నాళ్లూ ‘ఆ నలుగురి’ ఆధిపత్యంలో  ప్రాచుర్యం పొందలేకపోయిన స్విస్ స్టార్  యూఎస్ ఓపెన్ టైటిల్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
 
జొకోవిచ్‌కు మళ్లీ షాక్
* యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్విస్ స్టార్
* రూ. 23 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

న్యూయార్క్: కెరీర్‌లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు మరోసారి భంగపాటు ఎదురైంది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తనను ఓడించి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ అవకాశాన్ని అడ్డుకున్న స్టానిస్లాస్ వావ్రింకా(స్విట్జర్లాండ్)నే మరోసారి ఈ సెర్బియా యోధుడికి షాక్ ఇచ్చాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా 6-7 (1/7), 6-4, 7-5, 6-3తో టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించాడు. తద్వారా వావ్రింకా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. విజేతగా నిలిచిన వావ్రింకాకు 35 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 41 లక్షలు), జొకోవిచ్‌కు 17 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 70 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
 
ఏకంగా 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో వావ్రింకా పోరాటపటిమ ముందు జొకోవిచ్ తలవంచక తప్పలేదు. ఈ టోర్నీలో డానియల్ ఇవా న్స్ (బ్రిటన్)తో జరిగిన మూడో రౌండ్‌లో వావ్రింకా మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకున్నాడు. ఆఖరికి టోర్నీ విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు. ఓవరాల్‌గా వావ్రింకాకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను వావ్రింకా గెలిచాడు. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచే క్రమంలో క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌ను వావ్రింకా ఓడించాడు. జొకోవిచ్‌పై గెలిచిన మూడు గ్రాండ్‌స్లామ్స్‌లో వావ్రింకాకు టైటిల్ దక్కడం విశేషం.
 
నెమ్మదిగా మొదలుపెట్టి...
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు సెట్‌లు ఆడి ఫైనల్‌కు చేరిన వావ్రింకా తుది పోరులోనూ ఆరంభంలో తడబడ్డాడు. ఒకదశలో 2-5తో వెనుకబడ్డాడు. అరుుతే నెమ్మదిగా జోరు పెంచి స్కోరును 5-5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం చలాయించి 58 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో వావ్రింకా ఆటతీరు మెరుగైంది. తన ప్రధాన ఆయుధమైన బ్యాక్‌హ్యాండ్ షాట్‌లతో ఈ స్విస్ స్టార్ చెలరేగిపోయాడు.

నాలుగో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకొని 4-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన వావ్రింకా రెండో సెట్‌ను 47 నిమిషాల్లో గెలుపొంది ఫామ్‌లోకి వచ్చాడు. మూడో సెట్‌లో ఇద్దరూ ప్రతి పారుుంట్ కోసం పోరాడారు. చివరకు 12వ గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన వావ్రింకా ఈ సెట్‌ను 76 నిమిషాల్లో దక్కించుకున్నాడు. నాలుగో సెట్ వచ్చేసరికి ఇద్దరూ అలసిపోరుునట్లు కనిపించారు. జొకోవిచ్ పాదానికి గాయం కావడంతో అతను చురుకుగా కదల్లేకపోయాడు. మరోవైపు వావ్రింకా అలసిపోరుునా పట్టువదలకుండా పోరాడుతూ జొకోవిచ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొమ్మిదో గేమ్‌లో వావ్రింకా సర్వీస్‌లో జొకోవిచ్ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో ఈ స్విస్ స్టార్‌కు విజయం ఖాయమైంది.
 
బాధను ఆస్వాదించా...
‘‘ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్‌ను ఓడించాలంటే శాయశక్తులా పోరాడాలి. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మ్యాచ్ ముగిశాక నా వద్ద ఎలాంటి శక్తి మిగల్లేదు. అంతా మ్యాచ్‌లోనే ధారపోశాను. ఫైనల్ సందర్భంగా నా బలహీనతలు ప్రదర్శించకూడాదని నిర్ణయించుకున్నాను. కండరాలు పట్టేసినా, నొప్పి ఉన్నా భరించాను. బాధను ఆస్వాదిస్తూ ఆడాను. ఆఖరికి విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.’’    
- వావ్రింకా

 
11 టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో మూడింటిని నెగ్గిన 11వ ప్లేయర్ వావ్రింకా.
 
2 కెన్ రోజ్‌వెల్ (35 ఏళ్లు-1970లో) తర్వాత యూఎస్ ఓపెన్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా వావ్రింకా (31 ఏళ్లు) నిలిచాడు.
 
5 30 ఏళ్లు దాటాక కనీసం రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్ వావ్రింకా.
 
1 యూఎస్ ఓపెన్‌లో తొలి సెట్ గెలిచాక మ్యాచ్ ఓడిపోవడం జొకోవిచ్‌కిదే తొలిసారి.

మరిన్ని వార్తలు