ఒలింపిక్ బెర్త్‌పై గగన్, బింద్రా గురి

6 Apr, 2015 01:55 IST|Sakshi

ప్రపంచకప్ బరిలోకి స్టార్ షూటర్లు
 
న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో కొరియాలో ప్రారంభంకానున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ రైఫిల్, పిస్టల్ వరల్డ్‌కప్‌లో రాణించి రియో ఒలింపిక్స్-2016 బెర్త్‌లను దక్కించుకోవాలని భారత మేటి షూటర్లు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ భావిస్తున్నారు. ఈ ఏడాది ఒలింపిక్ కోటా కోసం జరుగుతున్న తొలి పోటీలు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే నెలకొంది. పురుషుల విభాగంలో 14, మహిళల విభాగంలో 10 బెర్త్‌లు ఉన్నాయి. గతేడాది స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గి జీతూ రాయ్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా, ఆసియా క్రీడల తర్వాత బింద్రా పాల్గొంటున్న మొదటి అంతర్జాతీయ ఈవెంట్ ఇది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

లండన్ గేమ్స్ కాంస్య విజేత నారంగ్‌తో పాటు అయోనికా పాల్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంపై దృష్టిసారించారు. మాజీ నంబర్‌వన్ హీనా సిద్ధు కూడా ఒలింపిక్స్ బెర్త్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రైఫిల్, పిస్టల్ షూటర్లకు ఈ ఈవెంట్ అతి పెద్ద పరీక్ష అని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ అన్నారు. షూటర్లందరూ ఆశించిన మేరకు రాణించి దేశానికి పేరు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు