ధోని సరికొత్త అవతారం

5 Nov, 2019 15:37 IST|Sakshi

కోల్‌కతా: టీమిండియాత తన తొలి డే అండ్‌ నైట్‌ టెస్టుకు సిద్ధమైన తరుణంలో అందుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సన్నాహాలు చేస్తోంది. నవంబర్‌ 22వ తేదీ నుంచి కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగనున్న డే అండ్‌ నైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్‌ జట్టు టెస్టు చరిత్రలో డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి యొక్క అనుభవాలను పంచుకోనుంది.

ఇందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ-  బ్రాడ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యాలు సంయుక్తంగా భారత మాజీ కెప్టెన్లకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరొకవైపు 2001లో ఆసీస్‌పై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లతో పాటు ఆ గెలుపులో భాగస్వామ్యం అయిన వారికి కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపనున్నారు.

ఇక భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కామెంటేటర్‌ అవతారం ఎత్తే అవకాశం కనబడుతోంది. ధోని చేత కామెంటరీ చెప్పించే ఏర్పాట్లను బీసీసీఐ పరిశీలిస్తోంది. దీనికి స్టార్‌ స్పోర్ట్స్‌ అంగీకారం తెలిపితే ధోనిని కామెంటరీ బాక్స్‌లో చూసే అవకాశం వీక్షకులకు దక్కుతుంది.  2019 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైన తర్వాత ధోని ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు. అప్పట్నుంచి తన వ్యక్తిగత పనులతో పాటు కుటుంబంతోనే ధోని గడుపుతున్నాడు. దాంతో ధోనిని ఫీల్డ్‌లో చూసే అవకాశాన్ని అతని అభిమానులు మిస్‌ అవుతున్నారు. ఒకవేళ ధోని వ్యాఖ్యాతగా వస్తే మరొకసారి అతని అభిమానులు ఖుషీ అవుతారు. ఇక ఆడియో కామెంటరీ ఏర్పాట్లకు కూడా స్టార్‌ యాజమాన్యం సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు