57 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు..

14 Dec, 2019 12:52 IST|Sakshi

స్టార్క్‌ విజృంభణ

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 55.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది.  ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ విజృంభించడంతో కివీస్‌ కుదేలైంది. కివీస్‌ ఆటగాళ్లలో రాస్‌ టేలర్‌(80) హాఫ్‌ సెంచరీ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆసీస్‌ బౌలర్ల దెబ్బకు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కివీస్‌ కనీసం రెండొంద పరుగుల మార్కును కూడా దాటలేకపోయింది. స్టార్క్‌ ఐదు వికెట్లతో న్యూజిలాండ్‌ పతానాన్ని శాసించాడు. టెస్టుల్లో స్టార్క్‌ ఐదు వికెట్లు తీయడం ఇది 13వసారి.109/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్‌ మరో 57 పరుగులు చేసి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు టేలర్‌ మినహా ఎవరూ రాణించలేదు. కివీస్‌ స్కోరు 120 పరుగుల వద్ద ఉండగా వాట్లింగ్‌(8) ఔట్‌ కావడంతో కివీస్‌ ఇక వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

టేలర్‌ ఏడో వికెట్‌గా, గ్రాండ్‌ హోమ్‌(23) ఎనిమిదో వికెట్‌ పెవిలియన్‌ చేరారు. జట్టు స్కోరు 166 పరుగుల వద్ద మిచెల్‌ సాంత్నార్‌(2), సౌథీ(8)లు ఔట్‌ కావడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  స్టార్క్‌కు జతగా నాథన్‌ లయన్‌ రెండు వికెట్లు తీయగా, హజిల్‌వుడ్‌, కమ్మిన్స్‌, లబూషేన్‌లు తలో వికెట్‌ తీశారు. అంతకుముందు ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. దాంతో కివీస్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం వచ్చినా ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అందుకు మొగ్గుచూపలేదు. రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించేందుకు ఆసక్తి చూపాడు. కివీస్‌ ముందు భారీ లక్ష్యాన్నా ఉంచాలనే ఉద్దేశంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించించింది. ప్రస్తుతం ఆసీస్‌ 250 పరుగుల ఆధిక్యంలో ఉంది.   

మరిన్ని వార్తలు