అవన్నీ పొరపాట్లే, చింతిస్తున్నా: స్టీవ్‌ బక్నర్‌

21 Jun, 2020 18:45 IST|Sakshi

క్రికెట్ ప్రపంచలో‌ దిగ్గజ అం​పైర్లలో ఒకరైన స్టీవ్‌ బక్నర్‌ మైదానంలో తాను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. రెండు సార్లు తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెండు సందర్భాల్లోనూ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ బలయ్యాడని చెప్పారు. అయితే, అవన్నీ పొరపాటు నిర్ణయాలేననని వెల్లడించారు. మాన్సన్‌ అండ్‌ గెస్ట్స్‌ అనే రేడియా కార్యక్రమంలో బక్నర్‌ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
(చదవండి: సానియాతో పెళ్లి.. మాలిక్‌ ఏమన్నాడంటే)

‘2003 గాబా టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ వేసిన బంతికి సచిన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, ఆ బంతి వికెట్ల పైనుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్టు రిప్లేలో తేలింది. మరోసారి 2005 కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్‌ బౌలర్‌ అబ్దుల్‌ రజాక్‌ వేసిన బంతికి సచిన్‌ను క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించా. కానీ, తర్వాత తెలిసింది, అది బ్యాట్‌కు తాకనే లేదని. మనుషులన్నాక పొరపాట్లు సహజం. అయితే,  వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్‌ కూడా తప్పుడు నిర్ణయాలు కావాలని తీసుకోడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో కిక్కిరిసిన అభిమానుల హర్షధ్వానాలే రెండో పొరపాటుకు కారణమని భావిస్తున్నా.

లక్ష మంది ఆ మ్యాచ్‌ వీక్షిస్తుండటంతో బంతి బ్యాట్‌కు తగిలింది లేనిది గ్రహించలేకపోయా. నా నిర్ణయాలకు చింతిస్తున్నా. వాటి వల్లే నా కెరీర్‌ ప్రమాదంలో పడొచ్చని అనుకుంటున్నా. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు’ అని బక్నర్‌ అన్నారు. ఇక క్రికెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డీఆర్‌ఎస్‌ పద్ధతి పొరపాటు నిర్ణయాలు సమీక్షించుకునేందుకు చక్కని అవకాశాలు ఇచ్చాయన్నారు. అవి అంపైరింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పలేను కానీ, నిర్ణయాల్లో కచ్చితత్వం తెస్తాయని మాత్రం చెప్పగలనని బక్నర్‌ పేర్కొన్నారు. 
(ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడతా)

మరిన్ని వార్తలు