‘స్మిత్‌ జీవితాంతం మోసగాడిగానే గుర్తుంటాడు’

9 Sep, 2019 16:10 IST|Sakshi

స్టీవ్‌ స్మిత్‌పై ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడి విమర్శలు

లండన్‌ : ఎన్ని రికార్డులు సాధించినా ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌ తన జీవితాంతం మోసగాడిగానే అందరికీ గుర్తుండిపోతాడని ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు స్టీవ్‌ హార్మిసన్‌ విమర్శించాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో అపకీర్తిని మూటగట్టుకున్న స్మిత్‌.. తను సమాధి వరకు దానిని తీసుకు వెళ్లకతప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 185 పరుగుల తేడాతో ఓడించి ఆసీస్‌ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన స్టీవ్‌ స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా నిలిచాడు.

ఈ క్రమంలో ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌తో మాట్లాడిన స్టీవ్‌ హార్మీసన్‌...‘స్టీవ్‌స్మిత్‌ ఎంత గొప్పగా రాణించినా క్రీడా ప్రపంచం తననెప్పటికీ క్షమించదు. మోసగాడిగా పేరొందిన ఆటగాడు ఆ చెడ్డపేరును తాను సమాధి అయ్యేంత వరకు మోస్తూనే ఉంటాడు. దక్షిణాఫ్రికాలో స్మిత్‌ ఏం చేశాడో క్రికెట్‌ అభిమానులు అంత తేలికగా మరిచిపోతారని నేను అనుకోవడం లేదు. స్మిత్‌తో పాటు బెన్‌క్రాఫ్ట్‌, వార్నర్‌పై కూడా వారి అభిప్రాయం మారదు. ఎందుకంటే వారు క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చి ఆటను నాశనం చేశారు’ అని వ్యాఖ్యానించాడు. కాగా గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధాన్ని అనుభవించినా వార్నర్‌, స్మిత్‌లపై నేటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

ఇక యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు మొదలుకొని ప్రతీ మ్యాచ్‌లోనూ ఇంగ్లీష్‌ అభిమానులు వారిని ‘చీటర్..చీటర్‌‌’  అంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. పైగా ఆదివారం నాటి మ్యాచ్‌తో యాషెస్‌ మరోసారి ఆసీస్‌ సొంతం కావడంతో వారి కోపం నశాలానికి అంటింది. కాగా నాలుగో టెస్టులో గెలుపొందిన ఆసీస్‌ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా గణాంకాలు 2-2తో సమం అవుతాయి గనుక యాషెస్‌ ట్రోఫీ కంగారూల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో డబుల్‌ సెంచరీతో ఇంగ్లండ్‌ జట్టు పతనాన్ని శాసించిన స్మిత్‌పై స్టీవ్‌ హార్మిసన్‌ కూడా తనదైన శైలిలో అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. కాగా 2002లో భారత్‌పై మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హార్మిసన్‌ ఇంగ్లండ్‌ తరపున 63 టెస్టులతో పాటు 58 వన్డే, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన అతడు 2009లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో చివరిసారిగా మైదానంలోకి దిగాడు. 

>
మరిన్ని వార్తలు