స్టీవ్‌ స్మిత్‌ మరో రికార్డు

5 Aug, 2019 13:39 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొని ఇటీవలే పునరాగమనం చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. తన జోరును కొనసాగిస్తున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు సెంచరీలు సాధించి తన ఫామ్‌లో ఎటువంటి మార్పు లేదని చాటిచెప్పాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. దాంతో తన టెస్టు కెరీర్‌లో 25వ సెంచరీని స్మిత్‌ నమోదు చేశాడు. ఫలితంగా వేగవంతంగా 25వ సెంచరీ మార్కును చేరిన రెండో క్రికెటర్‌గా స్మిత్‌ గుర్తింపు పొందాడు.

ఈ క్రమంలోనే కోహ్లి రికార్డును స్మిత్‌ బ్రేక్‌ చేశాడు. ఇప్పటివరకూ 25 సెంచరీలను వేగవంతంగా సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉండగా, దాన్ని స్మిత్‌ సవరించాడు. స్మిత్‌ 119 ఇన్నింగ్స్‌ల్లోనే 25వ టెస్టు సెంచరీని సాదించగా, కోహ్లి ఈ మార్కును చేరడానికి 127 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.  ఇక్కడ తొలి స్థానంలో సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ఉన్నారు. బ్రాడ్‌మన్‌ 68 ఇన్నింగ్స్‌ల్లోనే 25 టెస్టు సెంచరీలు సాధించడం విశేషం. ఇక తన సమకాలీన క్రికెటర్ల పరంగా చూస్తే టెస్టు యావరేజ్‌లో స్మిత్‌నే టాప్‌లో కొనసాగుతున్నాడు. స్మిత్‌ 62.96 టెస్టు సగటుతో ఉండగా, కోహ్లి 53.76 సగటుతో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో కేన్‌ విలియమ్సన్‌(53.38), జో రూట్‌(49.09)లు ఉన్నారు. (ఇక్కడ చదవండి: ఇంగ్లండ్‌ లక్ష్యం 398)

>
మరిన్ని వార్తలు