‘దశ’ ధీరుడు స్మిత్‌..

14 Sep, 2019 11:34 IST|Sakshi

లండన్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ మరో రికార్డు సాధించాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌(80) పరుగులు చేశాడు. దాంతో యాషెస్‌లో వరుసగా యాభైకి పరుగుల్ని పదిసార్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అదే సమయంలో ఓవరాల్‌ టెస్టు క్రికెట్‌లో సైతం ఒకే ప్రత్యర్థిపై వరుసగా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.  ఈ క్రమంలోనే ఇప్పటివరకూ ఒక ప్రత్యర్థిపై వరుసగా తొమ్మిదిసార్లు యాభైకి పరుగులు సాధించిన పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌( ఇంగ్లండ్‌పై) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. ఈ జాబితాలో స్మిత్‌, హక్‌ల తర్వాత స్థానాల్లో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌(8, ఇంగ్లండ్‌పై),  దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వస్‌ కల్లిస్‌(8, పాకిస్తాన్‌పై), శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరా(8, బంగ్లాదేశ్‌పై ) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

యాషెస్‌ టెస్టు చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు విఫలమైనప్పటికీ స్మిత్‌ పోరాడాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ఈ సిరీస్‌లో స్మిత్‌ ఇప్పటివరకూ 751 పరుగులు సాధించడం ఇక్కడ మరో విశేషం.  ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 69 పరుగుల ఆధిక్యం దక్కింది. శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 271/8తో ప్రారంభమైన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 294 పరుగుల వద్ద ముగిసింది. మిచెల్‌ మార్ష్‌ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియాను పదునైన బంతులతో పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (6/62) వణికించాడు.  కాగా, లబషెన్‌ (48; 10 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించి స్మిత్‌ జట్టును నిలబట్టే ప్రయత్నం చేశాడు. కరన్‌ (3/46) సైతం ప్రతాపం చూపడంతో ఆసీస్‌ ఎక్కువసేపు నిలవలేకపోయింది.

మరిన్ని వార్తలు