ఆ క్యాచే కొంపముంచిందా?

22 May, 2017 16:37 IST|Sakshi
ఆ క్యాచే కొంపముంచిందా?

హైదరాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్లో స్వల్ప లక్ష్యాన్ని సునాయంగా ఛేదిస్తుందని భావించిన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్ జట్టు చివరికి ఓటమి పాలైంది. చేతుల్లోకి ఇచ్చిన మ్యాచ్‌ను చేజార్చుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తన టీమ్‌ పరాజయంతో స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృధా అయింది. అర్ధసెంచరీతో చివరి ఓవర్‌ వరకు పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కీలక సమయంలో అవుటవడంతో పుణే మూల్యం చెల్లించుకుంది.

ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిని మనోజ్‌ తివారి చక్కటి ఫోర్‌గా మలిచాడు. తర్వాతి బంతికి అతడు అవుటయ్యాడు. అయితే స్మిత్‌ క్రీజ్‌లో ఉండడంతో పుణే విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అప్పటికే అతడు ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ పుణేకు మిచెల్‌ జాన్సన్‌ షాక్‌ ఇచ్చాడు. తివారి అవుట్‌ చేసిన తర్వాతి బంతికే స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు.

స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను అంబటి రాయుడు పట్టడంతో అతడు నిరాశగా మైదానాన్ని వీడాడు. ఈ క్యాచ్‌ను రాయుడు వదిలేసివుంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్యాచ్‌ ఫలితాన్ని మార్చేసిందని అందరూ అభిప్రాయపడ్డారు. స్మిత్‌ అవుటైన తర్వాత పుణేపై ఒత్తిడి మరింత పెరిగింది. చివరి బంతికి 4 పరుగులు చేయాల్సిన పుణే రెండు పరుగులు మాత్రమే సాధించి ఓటమి పాలయింది. స్మిత్‌ ఉన్నంతసేపు పుణేవైపు ఉన్న మ్యాచ్‌ అతడు అవుటైన తర్వాత ముంబై చేతుల్లోకి వచ్చింది. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి రోహిత్‌ సేన మూడోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

మరిన్ని వార్తలు