కోహ్లిని దాటేశాడు..!

6 Sep, 2019 11:27 IST|Sakshi

మాంచెస్టర్‌:  ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి నంబర్‌ వన్‌ టెస్టు ర్యాంకను లాగేసుకున్న ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లి అధిగమించేశాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జరుగుతున్న నాల్గో టెస్టులో స్మిత్‌(211) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. హాఫ్‌ సెంచరీ, సెంచరీలను ఏకంగా డబుల్‌ సెంచరీగా మలుచుకుని ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఈ క్రమంలోనే కోహ్లి సాధించిన టెస్టు సెంచరీలను కూడా స్మిత్‌ దాటేశాడు. ఇప్పటివరకూ కోహ్లి 25 టెస్టు సెంచరీలు సాధిస్తే, స్మిత్‌ 26వ టెస్టు సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. సమకాలీన టెస్టు క్రికెట్‌లో స్మిత్‌-కోహ్లిల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.

అయితే ఏడాది నిషేధం ఎదుర్కొని కూడా స్మిత్‌ తన టాప్‌ గేర్‌ను కొనసాగించడం ఇక్కడ విశేషం. యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్‌.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌కు, మూడో టెస్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు. తొలి టెస్టులో (144, 142), రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు స్మిత్‌. ఇక నాల్గో టెస్టులో డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. మూడో టెస్టు ఆడని కసితో పరుగుల దాహాన్ని కూడా తీర్చుకున్నాడు. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ స్మిత్‌ 147. 25 సగటుతో 589 పరుగులు సాధించడం మరొక విశేషం.

ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు
ఇక ఓవరాల్‌ యాషెస్‌ సిరీస్‌లో మూడో డబుల్‌ సెంచరీని స్మిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌(8), వాలీ హమ్మాండ్‌(4)లు మాత్రమే స్మిత్‌ కంటే ముందున్నారు. మరొకవైపు ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక టెస్టు సెంచరీలు జాబితాలో స్మిత్‌ నాల్గో స్థానాన్ని ఆక్రమించారు. ఇంగ్లండ్‌పై స్మిత్‌ సాధించిన టెస్టు సెంచరీలు 11. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌(19 సెంచరీలు, ఇంగ్లండ్‌పై),  సునీల్‌ గావస్కర్‌(13 సెంచరీలు, వెస్టిండీస్‌పై)జాకబ్‌ హాబ్స్‌(12 సెంచరీలు, ఆసీస్‌పై) లు స్మిత్‌ కంటే ఉన్నారు.  గత 25 ఏళ్లలో ఇంగ్లండ్‌ గడ్డపై డబుల్‌ సెంచరీలు ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌.

మరిన్ని వార్తలు