మెరిసిన స్మిత్‌

11 May, 2019 00:44 IST|Sakshi

ఆస్ట్రేలియా ఎలెవెన్‌ గెలుపు 

బ్రిస్బేన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా... ప్రపంచ కప్‌ సన్నాహాన్ని విజయంతో ముగించింది. న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో 16 పరుగులతో గెలుపొందింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఎలెవెన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ విల్‌ యంగ్‌ (108 బంతుల్లో 111; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఓపెనర్‌ జార్జి వర్కర్‌ (72 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆల్‌ రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. కమిన్స్‌ (4/32) నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌ (2), ఖాజా (23) విఫలమైనా వన్‌డౌన్‌లో వచ్చిన మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (108 బంతుల్లో 91 నాటౌట్‌; 10 ఫోర్లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (48 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. 44 ఓవర్లకు స్కోరు 248/5 వద్ద ఉండగా సరైన వెలుతురు లేని కారణంగా ఆటను నిలిపివేశారు. డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం ఆస్ట్రేలియా ఎలెవెన్‌ 16 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. మూడు సన్నాహక మ్యాచ్‌ల్లో ఆసీస్‌ రెండు నెగ్గగా, కివీస్‌ ఒకదాంట్లో విజయం సాధించింది.    

మరిన్ని వార్తలు