ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధం: స్మిత్‌

2 Jun, 2020 00:39 IST|Sakshi

సిడ్నీ: ఒకవేళ టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఐపీఎల్‌ ఆడేందుకు తాను సిద్ధమేనని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న స్మిత్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తే భారత్‌కు ప్రయాణించేందుకు అభ్యంతరం లేదన్నాడు. ‘వన్డే, టి20 ప్రపంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే అత్యున్నత గౌరవం. నా మొదటి ప్రాధాన్యం దానికే. ఒకవేళ వరల్డ్‌కప్‌ వాయిదా పడి దాని స్థానంలో ఐపీఎల్‌ జరిగితే ఆడేందుకు నేను సిద్ధం. కానీ అది మన చేతుల్లో లేదు. ప్రస్తుతానికి వరల్డ్‌కప్‌ భవితవ్యం ప్రభుత్వం, నిపుణుల సలహాలు సూచనలపై ఆధారపడి ఉంది’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

బంతిని మెరిపించేందుకు లాలాజలం వాడకం నిషేధిస్తే బౌలర్లు తేలిపోతారని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. పింక్‌ బంతితో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం తమకు భారత్‌తో మ్యాచ్‌లో ఉపయోగపడుతుందని అన్నాడు. ‘బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీ సమాన స్థాయిలో ఉండాలని కోరుకునే వాళ్లలో నేనొక్కడిని. లాలాజలానికి ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం కష్టమే. ఈ విషయంలో ఐసీసీ ఏం ఆలోచిస్తుందో మరి. టీమిండియా కన్నా పింక్‌ బంతితో ఎక్కువగా మేమే ఆడాం. వారితో మ్యాచ్‌లో ఈ అనుభవం మాకు పనికొస్తుంది. కానీ భారత జట్టులో పరిస్థితులకు అనుగుణంగా సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు’ అని స్మిత్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు