సచిన్‌, కోహ్లిలను దాటేశాడు..

2 Aug, 2019 14:27 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌ : బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైన ఆస్ట్రేలియన్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ టెస్టుల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో స్మిత్‌(144) భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్‌ 284 పరుగులు చేసింది. ఆసీస్‌ 122 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్న సమయంలో స్మిత్‌ సెంచరీతో ఆదుకున్నాడు.

ఈ నేపథ్యంలో స్టీవ్‌ స్మిత్‌ 118 ఇన్నింగ్స్‌ల్లోనే 24 సెంచరీలు పూర్తి చేశాడు. ఫలితంగా తక్కుjవ ఇన్నింగ్స్‌ల్లో 24 సెంచరీలు పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్‌గా స్మిత్‌ నిలిచాడు. ఈ క్రమంలోనే సచిన్‌, విరాట్‌ కోహ్లిలను స్మిత్‌ అధిగమించాడు.  సచిన్‌ 123 ఇన్నింగ్స్‌ల్లో 24వ టెస్టు సెంచరీ మార్కును చేరగా, దీన్ని అందుకోవడానికి కోహ్లి 125 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

కాగా, ఆసీస్‌ దిగ్గజ బాట్స్‌మన్‌ సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ 66 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా టెస్టుల్లో 24 సెంచరీలు పూర్తి చేసి గ్రెయిగ్‌ చాపెల్‌, వివ్‌ రిచర్డ్స్‌, మహ్మద్‌ యూసఫ్‌ సరసన నిలిచాడు.  ఓవరాల్‌ యాషెస్‌ సిరీస్ వేదికలో ఇప్పటివరకు స్టీవ్‌ స్మిత్‌ 42 ఇన్నింగ్స్‌లో 60 సగటుతో 9 సెంచరీలు నమోదు చేశాడు.

మరిన్ని వార్తలు