ఐపీఎల్: స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్!

26 Mar, 2018 15:30 IST|Sakshi
స్టీవ్ స్మిత్‌

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్‌కు జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ నుంచి స్టీవ్‌ స్మిత్‌ను యాజమాన్యం తప్పించింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను నియమించింది. 

బాల్ ర్యాంపరింగ్‌కు పాల్పడటంతో పాటు తాము చేసింది చిన్న తప్పు అన్నతీరుగా వ్యవహరించి స్మిత్ క్రీడాస్ఫూర్తిని దెబ్బతీశాడని అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రకటించినట్లు తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ పై ఐసీసీ తీసుకునే చర్యలపై ఈ ఆసీస్ ఆటగాడిని ఐపీఎల్ లో ఆడనివ్వాలా.. వద్దా.. అన్నదానిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రధాని మాల్కం టర్న్‌బుల్ స్పందించడంతో.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సైతం స్మిత్‌పై తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

 

>
మరిన్ని వార్తలు