మళ్లీ బ్యాట్‌ పట్టనున్న స్టీవ్‌ స్మిత్‌ 

26 May, 2018 01:13 IST|Sakshi

గ్లోబల్‌ టి20 కెనడా లీగ్‌ బరిలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ 

మెల్‌బోర్న్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తిరిగి బ్యాట్‌ పట్టనున్నాడు. జూన్‌ 28 నుంచి ప్రారంభం కానున్న గ్లోబల్‌ టి20 కెనడా లీగ్‌లో ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బరిలో దిగనున్నాడు. ఈ లీగ్‌లో క్రిస్‌ గేల్, రసెల్, సామీ, సునీల్‌ నరైన్, మలింగ, క్రిస్‌ లిన్, డేవిడ్‌ మిల్లర్, ఆఫ్రిది మార్క్యూ ప్లేయర్లుగా అందుబాటులో ఉన్నారు. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఫైనల్‌ జూలై 16న జరుగనుంది. ‘కెనడా క్రికెట్‌లో ఇది అతిపెద్ద అడుగు. గ్లోబల్‌ టి20 లీగ్‌ ద్వారా అంతర్జాతీయ స్టార్‌ ఆటగాళ్లను అతి దగ్గరగా చూసే అవకాశం కెనడా ప్రేక్షకులకు లభించనుంది’ అని క్రికెట్‌ కెనడా అధ్యక్షుడు రంజిత్‌ సైనీ తెలిపారు.  

దక్షిణాప్రికా పర్యటనలో మూడో టెస్టు సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం వెలుగు చూడటంతో అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించింది. రెండేళ్లపాటు నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉంచడంతో పాటు 100 గంటలు కమ్యూనిటీ క్రికెట్‌కు స్వచ్ఛంద సేవ చేయాలని కూడా పేర్కొంది. ఈ సందర్భంగా విదేశీ లీగ్‌ల్లో ఆడటంపై సీఏ ఎలాంటి పరిమితి విధించలేదు. అయినప్పటికీ బీసీసీఐ అతన్ని ఐపీఎల్‌లో ఆడటానికి అనుమతించలేదు.   

మరిన్ని వార్తలు