మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

21 Aug, 2019 04:18 IST|Sakshi

లండన్‌: తొలి టెస్టులో గెలిచి, రెండో టెస్టును ‘డ్రా’గా ముగించి యాషెస్‌ సిరీస్‌లో పై చేయిగా ఉన్న ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌... గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టు నాలుగో రోజు ఇంగ్లండ్‌ పేసర్‌ ఆర్చర్‌ వేసిన షార్ట్‌బాల్‌ స్మిత్‌ మెడకు బలంగా తగిలిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు మైదానాన్ని వీడిన అతడు గంటలోపే తిరిగొచ్చి ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. కానీ, మరుసటి రోజు తలనొప్పి, మగతగా ఉండటంతో మైదానంలోకి దిగలేదు.

దీంతో ఆసీస్‌ కాంకషన్‌ సబ్‌ స్టిట్యూట్‌గా మార్నస్‌ లబషేన్‌ను ఆడించింది. ‘స్మిత్‌ మంగళవారం జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. అతడు హెడింగ్లీలో జరిగే మూడో టెస్టులో ఆడడని కోచ్‌ లాంగర్‌ ధ్రువీకరించాడు’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. పూర్తిగా కోలుకోకపోవడం, మ్యాచ్‌కు మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో స్మిత్‌ను ఆడించకపోవడమే ఉత్తమమని భావించినట్లు సమాచారం. ప్రస్తుత యాషెస్‌లో రెండు జట్ల మధ్య తేడా స్మిత్‌. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమై నా రెండు సెంచరీలు, 92 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు అతడు కీలకంగా మారాడు.

మరిన్ని వార్తలు