‘వారికి ఎంత పెద్ద మైదానాలైనా సరిపోవు’

4 Jun, 2019 15:33 IST|Sakshi

నాటింగ్‌హామ్‌:  వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో పోరుకు ముందు ఆస్ట్రేలియాను ఆ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా హెచ్చరించాడు. విధ్వంసకర కరీబియన్‌ జట్టుతో ముప్పు పొంచి ఉందని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో స్టీవ్‌ వా ముందుగానే ఆసీస్‌ను జాగ్రత్తపడమని పేర్కొన్నాడు.  ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేసిన అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు.

‘కంగారూలకు వెస్టిండీస్‌ అసలు సిసలు పరీక్ష పెట్టగలదు. ఆ జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. చక్కని బౌలింగ్‌ విభాగం ఉంది. కరీబియన్‌ జట్టును జాగ్రత్తగా గమనించాలి. ఎంతటి దుర్భేద్యమైన బౌలింగ్‌నైనా వారు తుత్తునియలు చేయగలరు. మ్యాచ్‌లు మలుపుతిప్పగలరు. వారి బ్యాటింగ్‌ విభాగం పుంజుకుంటే ఎంత పెద్ద మైదానాలైనా సరిపోవు. అమాంతం విరుచుకు పడగలరు. చాలా ఏళ్ల తర్వాత విండీస్‌ పేస్‌ విభాగంలో బలం కనిపిస్తోంది. టోర్నీలో ఏ జట్టైనా వారితో ఆడాలంటే భయపడుతోంది. అందుకే వారితో నాకౌట్‌ మ్యాచ్‌లో తలపడడం నాకిష్టం లేదు. కరీబియన్లు టోర్నీలో త్వరగా జోరందుకుంటే సులభంగా ట్రోఫీ గెలవగలరు’ అని స్టీవ్‌ వా అన్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో పాక్‌ను వెస్టిండీస్‌ చిత్తుగా ఓడించి మంచి జోష్‌ మీద ఉండగా, అఫ్గానిస్తాన్‌పై ఆసీస్‌ విజయం సాధించి శుభారంభం చేసింది.

>
మరిన్ని వార్తలు