స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

19 Jan, 2017 18:04 IST|Sakshi
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడు వేల పరుగుల్ని వేగంగా సాధించిన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో స్మిత్ మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆ ఘనతను వేగవంతంగా సాధించిన ఆసీస్ క్రికెటర్గా గుర్తింపు పొందాడు.  ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ ఆటగాళ్లు మైకేల్ బెవాన్,  బెయిలీలను స్మిత్ అధిగమించాడు. మూడు వేల వన్డే పరుగుల్ని చేయడానికి బెవాన్, బెయిలీలకు 80 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, స్మిత్ తన 79 వ ఇన్నింగ్స్ లో ఆ మార్కును చేరాడు.

ఈ మ్యాచ్లో స్మిత్(108 నాటౌట్;104 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి ఆసీస్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. పాక్ విసిరిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో స్మిత్ ఆదుకున్నాడు. హ్యాండ్ స్కాంబ్(82;84 బంతుల్లో 6 ఫోర్లు) తో కలిసి మూడో వికెట్ కు 183 పరుగుల భాగస్వామ్యాన్నిసాధించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. వీరిద్దరూ రాణించడంతో ఆసీస్ 45. 0 ఓవర్లలో నే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో విజయంతో ఆసీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో ఆసీస్ గెలవగా, రెండో వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఐదు వన్డేల సిరీస్ లో నాల్గో మ్యాచ్ ఆదివారం జరుగనుంది.

మరిన్ని వార్తలు