పరుగు తేడాతో గెలుపు.. స్టెయిన్‌ రికార్డు

13 Feb, 2020 15:47 IST|Sakshi

ఈస్ట్‌ లండన్‌(దక్షిణాఫ్రికా): దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌  అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా సఫారీలు పరుగు తేడాతో గెలుపొందారు. దక్షిణాఫ్రికా విజయంలో లుంగీ ఎన్‌గిడి కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు సాధించి సఫారీలకు విజయాన్ని అందించాడు.

చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో స్టెయిన్‌ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ రికార్డును స్టెయిన్‌ బ్రేక్‌ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఇప్పుటివరకూ తాహీర్‌ 61 టీ20 వికెట్లు సాధించగా, స్టెయిన్‌ దాన్ని బద్ధలు కొట్టాడు.  ఇంగ్లండ్‌తో తొలి టీ20ల్లో  జోస్‌ బట్లర్‌ వికెట్‌ను తీయడం ద్వారా తాహీర్‌ రికార్డును సవరించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డు శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగా పేరిట ఉంది. మలింగా ఇప్పటివరకూ 106 అంతర్జాతీయ టీ20 వికెట్లు సాధించి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో షాహిద్‌ ఆఫ్రిది(96), షకిబుల్‌ హసన్‌(92)లు ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు రికార్డు కూడా స్టెయిన్‌ పేరిటే ఉన్న సంగతి తెలిసిందే. 439 టెస్టు వికెట్లు సాధించి సఫారీ జట్టు తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు