స్టెయిన్‌ ‘గన్‌ డౌన్‌’

8 Jan, 2018 03:53 IST|Sakshi

గాయాలతో స్టార్‌ పేసర్‌ సతమతం

మరోసారి మ్యాచ్‌ మధ్యలోనే విరమణ

పునరాగమనం ఇక కష్టమేనా!

భారత్‌తో జరుగుతున్న కేప్‌టౌన్‌ టెస్టులో 17.3 ఓవర్లు వేసిన తర్వాత... ఈ మ్యాచ్‌కు ముందు తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై పెర్త్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్ల తర్వాత... అంతకు కొన్నాళ్ల క్రితం డర్బన్‌లో ఇంగ్లండ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 3.5 ఓవర్ల తర్వాత... దానికంటే ముందు మొహాలీలో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో 11 ఓవర్లకే! దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ మ్యాచ్‌ మధ్యలోనే తప్పుకోవడం ఇది కొత్త కాదు.

తాను బరిలోకి దిగిన గత ఆరు టెస్టుల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆట మధ్యలోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు కూడా అతను తొలి టెస్టుతో పాటు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అతను మళ్లీ కోలుకొని జట్టులోకి రావడం, గత స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం కావచ్చు. పదమూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసి ఎందరో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన స్టెయిన్‌ కెరీర్‌ ప్రమాదంలో పడింది.   

తొలి టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా కోచ్‌ ఒటిస్‌ గిబ్సన్‌ మీడియాతో మాట్లాడుతూ స్టెయిన్‌కు తుది జట్టులో దాదాపుగా అవకాశం లేదని తేల్చేశాడు. జట్టు కూర్పు ఒక సమస్య కాగా, గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతను, ఏదైనా జరిగి మ్యాచ్‌ మధ్యలో తప్పుకుంటే సమస్యగా మారుతుందని స్పష్టంగా చెప్పాడు. నిజంగా ఆయన భయపడినట్లే జరిగింది.

న్యూలాండ్స్‌ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని సఫారీ జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడంతో స్టెయిన్‌కు చాన్స్‌ లభించినా... అతను మళ్లీ గాయంతో వెనుదిరగడం ఆ టీమ్‌ను ముగ్గురు పేసర్లకే పరిమితం చేసింది. ఇది చివరకు జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చు కూడా. భుజం గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత పునరాగమనం చేశాక ఇప్పుడు మరో కొత్త తరహా గాయం (మడమ)తో అతను మధ్యలోనే వెళ్లిపోవడం  ఏమాత్రం మేలు చేసేది కాదు. భారత్‌తో సిరీస్‌ తర్వాత మార్చిలో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌ కూడా ఉంది. అతను అప్పటిలోగా కోలుకోగలడా?  

ప్రదర్శన బాగున్నా...
భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత స్టెయిన్‌ ముందుగా దేశవాళీ టి20ల్లో ఐదు మ్యాచ్‌లు ఆడి తన ఫిట్‌నెస్‌ పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వేతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా 12 ఓవర్లు వేశాడు. అయితే అనారోగ్యంతో జింబాబ్వేతో టెస్టు ఆడలేకపోయాడు. భారత్‌తో మ్యాచ్‌లో అతని బౌలింగ్‌లో ఎప్పటిలాగే పదును కనిపించడం విశేషం. షార్ట్‌ బంతులు, అవుట్‌ స్వింగర్లు వేయడంలో ఎక్కడా తీవ్రత తగ్గకపోగా, బౌలింగ్‌ రనప్, యాక్షన్‌లో ఎక్కడా పాత గాయం సమస్య కనిపించలేదు.

ధావన్‌ను వెనక్కి పంపిన బంతిగానీ, ఆ వెంటనే కోహ్లిని దాదాపుగా అవుట్‌ చేసినట్లుగా అనిపించిన బంతిగానీ పాత స్టెయిన్‌ను చూపించాయి. చాలా సార్లు స్టెయిన్‌ బంతులు గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా దాటాయి. ఆ తర్వాత సాహా వికెట్, పాండ్యా క్యాచ్‌ డ్రాప్‌ అయిన బంతి కూడా అతని గొప్పతనాన్ని చాటాయి. అయితే దురదృష్టవశాత్తూ గాయం అతని జోరుకు బ్రేక్‌ వేసింది. నిజానికి దక్షిణాఫ్రికా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ లెక్కల ప్రకారం పేస్‌కు బాగా అనుకూలించే తర్వాతి రెండు టెస్టుల వేదికలు సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్‌లలో అతను తప్పనిసరిగా జట్టులో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడంలేదు. గత రెండేళ్ల కాలంలో అతను తుంటి, రెండు సార్లు భుజం, మడమ గాయాలకు గురయ్యాడు. భుజానికి సర్జరీ కూడా జరగడంతో అతను ఏడాది పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది.  

అద్భుతమైన రికార్డు...
సమకాలీన క్రికెట్‌లోని అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో స్టెయిన్‌ ఒకడు అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్ళలో జీవం లేని పిచ్‌లు, చిన్న మైదానాలు, పెద్ద బ్యాట్‌లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా అతను తన ముద్ర చూపించాడు. గాయాలు ఇబ్బంది పెడుతున్నా అతని బౌలింగ్‌ ఇంకా భీకరమే. గాయంతో పెర్త్‌ టెస్టు నుంచి తప్పుకోవడానికి ముందు తొలి ఇన్నింగ్స్‌లో అతని అద్భుత బౌలింగ్‌ పునాదితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్‌ గెలవగలిగింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టెయిన్‌ టాప్‌–10లో ఉన్నాడు. వారిలో కేవలం ఇద్దరు పేసర్లకు (మెక్‌గ్రాత్, హ్యాడ్లీ)లకు మాత్రమే స్టెయిన్‌ (22.32) కంటే మెరుగైన సగటు ఉంది. ఎంతో మంది పేసర్లు తమ సొంతగడ్డపై, అనుకూల పిచ్‌లపై చెలరేగినా... ఉపఖండానికి వచ్చేసరికి మాత్రం తేలిపోయారు.

అయితే ఈతరంలో తనతో పోటీ పడిన బ్రెట్‌ లీ, మిచెల్‌ జాన్సన్, అండర్సన్, బ్రాడ్‌ తదితరులతో పోలిస్తే భారత్‌లాంటి చోట అతని ప్రదర్శన స్టెయిన్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. భారత గడ్డపై 6 టెస్టుల్లో కేవలం 21.38 సగటుతో 26 వికెట్లు పడగొట్టడం, పాకిస్తాన్‌లో 24.66, శ్రీలంకలో 24.71 సగటు అతనేమిటో చెబుతాయి. దక్షిణాఫ్రికా తరఫున 44 టెస్టు విజయాల్లో భాగమైన స్టెయిన్‌... వాటిలో నమ్మశక్యం కాని రీతిలో 16.03 సగటుతో 291 వికెట్లు పడగొట్టడం అతని విలువేమిటో చూపిస్తోంది. ఇలాంటి గొప్ప ఆటగాడి కెరీర్‌ అర్ధాంతరంగా ముగియా లని ఏ జట్టూ కోరుకోదు. డాక్టర్ల సహకారంతో వీలైనంత త్వరగా అతను కోలుకునేలా ప్రయత్నిస్తామని జట్టు మేనేజర్‌ మూసాజీ చెప్పడం తమ స్టార్‌ ఆటగాడిపై వారికి ఉన్న నమ్మకమే కారణం. వారు ఆశించినట్లుగా స్టెయిన్‌ మళ్లీ తిరిగొచ్చి తన సత్తా చూపించాలని క్రికెట్‌ ప్రపంచం కూడా కోరుకుంటోంది.  

419: 86 టెస్టుల్లో స్టెయిన్‌ పడగొట్టిన వికెట్ల సంఖ్య. ఓవరాల్‌గా పదో స్థానంలో ఉన్న అతను... మరో మూడు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా  బౌలర్‌గా షాన్‌ పొలాక్‌ (421)ను అధిగమిస్తాడు.  

60 ఏళ్ల వయసులో కూడా 90 కిలోమీటర్ల మారథాన్‌ పరుగెత్తే కొందరు మిత్రులే నాకు ఆదర్శం. ఫిట్‌నెస్‌ గురించి నాకు బెంగ లేదు. ప్రస్తుతం మా జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకంటే నా ఫిట్‌నెస్‌ చాలా బాగుంది. కనీసం ఈ ఏడాది మొత్తం ఆడిన తర్వాతే కెరీర్‌పై పునరాలోచిస్తా. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో నాకు క్రికెట్‌ గురించే తప్ప రిటైర్మెంట్, ఇతర వ్యాపకాల గురించి ఆలోచన లేదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడాలని భావిస్తున్న నాకు వయసు సమస్యే కాదు.
–కేప్‌టౌన్‌ టెస్టుకు ముందు స్టెయిన్‌ వ్యాఖ్య  


కేప్‌టౌన్‌కు వానొచ్చింది
► మూడో రోజు ఆట పూర్తిగా రద్దు
► భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు   

కేప్‌టౌన్‌: అనూహ్య మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్‌కు ఆకస్మిక విరామం... రెండు రోజుల పాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన టెస్టుకు మూడో రోజు వాన అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా ఆదివారం ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రోజంతా ఒక్క బంతి వేయడం  కూడా సాధ్యం కాలేదు. శనివారం రాత్రి నుంచే నగరంలో కురుస్తున్న వర్షం ఆదివారం ఉదయం జోరందుకుంది. మధ్యలో కొన్ని సార్లు తెరిపినిచ్చినా, గ్రౌండ్‌ను సిద్ధం చేసేందుకు అది సరిపోలేదు. అంపైర్లు కనీసం న్యూలాండ్స్‌ మైదానాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా లేకుండా ఆటను రద్దు చేశారు. మ్యాచ్‌ నిర్దేశిత ఆరంభ సమయంనుంచి సరిగ్గా ఐదు గంటల తర్వాత అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 65 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓవరాల్‌గా 142 పరుగులు ముందంజలో ఉంది. మిగిలిన రెండు రోజుల ఆట ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఎలాంటి తుది ఫలితం వస్తుందో చూడాలి. సోమ, మంగళవారాల్లో రోజుకు 98 ఓవర్ల చొప్పున ఆట సాగనుంది.   మరోవైపు ఈ భారీ వర్షం స్థానికంగా క్రికెట్‌ వీరాభిమానులను కూడా ఏమాత్రం నిరాశపర్చలేదు. ఈ వాన వారిలో అమితానందాన్ని నింపింది. వర్షాలే లేకపోవడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న కేప్‌టౌన్‌కు ఇదో వరంగా వారు భావిస్తున్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం సోమవారం మాత్రం వర్షసూచన లేదు.  
–సాక్షి క్రీడా విభాగం

>
మరిన్ని వార్తలు