ఎవరూ బయటకు వెళ్లకండ్రా నాయనా!

15 May, 2020 15:40 IST|Sakshi

కరోనాతో యుద్ధం ముగిసిపోలేదు

ఇంకా చాలా దూరం ప్రయాణించాలి: జడేజా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో గెలవాలంటే ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉందని టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను లాక్‌డౌన్‌ నియమాల్ని పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నానని, ఎవరూ కూడా బయటకు వెళ్లవద్దన్నాడు. మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఇంట్లో ఉండటమే ఉత్తమం అని జడేజా తెలిపాడు. ఇప్పటికీ కరోనాతో యుద్ధం ముగిసిపోలేదన్న జడేజా.. మన వంతు బాధ్యతగా ఇంట్లో ఉండటమే మంచి మార్గమన్నాడు. దీనికి సంబంధించి తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దర్శనమిచ్చిన జడేజా.. బ్యాట్‌ పట్టుకుని ఇంటి పెరటిలోనే ప్రాక్టీస్‌ చేస్తూ ఈ సందేశాన్ని ఇచ్చిన వీడియోను షేర్‌ చేశాడు. బంతిని జస్ట్‌ టచ్‌ చేసిన జడేజా.. బ్యాట్‌తో కత్తిసాము చేసి మరీ చెప్పేశాడు.(టూత్‌ పేస్ట్‌ కొనడానికి బయటకొచ్చి..)

కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే గడుపుతున్నారు.  ఈ విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో  కాలక్షేపం చేస్తున్నారు.  ఇక ఇన్‌స్టాగ్రామ్‌ సెషన్స్‌లో పాల్గొంటూ తమకు నచ్చింది మాట్లాడేస్తూ ఉన్నారు. కాగా, కరోనా సంక్షోభం తర్వాత అక్కడక్కడ క్రికెట్‌ టోర్నీలు తిరిగి ఆరంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా భారత్‌లో మాత్రం ఇంకా ఎటువంటి ముందడుగు పడలేదు. ఇప‍్పటికే భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 80వేల దాటగా,  2,600 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో భారత్‌లో పరిస్థితులపై ఇంకా ఆందోళనగానే ఉంది. రోజూ కేసులు పెరుగుతూ ఉండటం కలవర పెడుతోంది. ఒకవైపు లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో రోడ్లపైకి జనం వచ్చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిందనే సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. దాంతో జనాలు రోడ్లపైకి వచ్చి తమ రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్నారు. మనకు ఏమీ కాదనకుంటూ ఎవరికి వారు బయటకు రావడం ప్రస్తుతం ఆందోళన కల్గిస్తున్న అంశం.. (ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా ఒలింపిక్‌ మెడలిస్ట్‌)

మరిన్ని వార్తలు