స్టోయినిస్‌ అనుచిత ప్రవర్తన.. భారీ జరిమానా

5 Jan, 2020 16:45 IST|Sakshi

మెల్‌బోర్న్‌: బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో దూకుడుగా ప్రవర్తించిన ఆసీస్‌ క్రికెటర్‌ మార్కస్‌ స్టోయినిస్‌పై భారీ జరిమానా విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. శనివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌-మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌ అయిన స్టోయినిస్‌.. మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ ఆటగాడే కేన్‌ రిచర్డ్‌సన్‌ను దూషించాడు. రిచర్డ్‌సన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా సీరియస్‌ కావడంతో తన తప్పును స్టోయినిస్‌ ఒప్పుకున్నాడు. ఆ క్రమంలోనే అతనికి 7,500 డాలర్ల జరిమానా విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది.

తన ప్రవర్తనపై ఎటువంటి చాలెంజ్‌కు వెళ్లకుండా ఒప్పుకోవడంతో స్టోయినిస్‌కు జరిమానాతో సరిపెట్టారు. దీనిలో భాగంగా రిచర్డ్‌సన్‌కు అంపైర్లకు స్టోయినిస్‌ క్షమాపణలు చెప్పాడు. ‘ ఆ క్షణంలో ఏమైందో నాకు తెలీదు. నేను దూషించిన మాట వాస్తవం. నేను తప్పు చేసాను అనే సంగతిని వెంటనే తెలుసుకున్నా. ఇది నిజంగా పెద్ద తప్పిదమే. కేన్‌కు, అంపైర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని స్టోయినిస్‌ పేర్కొన్నాడు.ఆ మ్యాచ్‌లో స్టోయినిస్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 8 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. రెనిగేడ్స్‌ 143 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని స్టార్స్‌ 18.5 ఓవర్లలో ఛేదించింది. స్టోయినిస్‌(68 నాటౌట్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(40)లు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు