పాక్‌ క్రికెటర్లకు స్ట్రాంగ్‌ కౌంటర్‌

5 Jun, 2020 16:19 IST|Sakshi

ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే ఇంగ్లండ్‌ ఇంటికెళ్లేది

పాకిస్తాన్‌ కంటే ఇంగ్లండ్‌ బలంగా లేదా?: ఆకాశ్‌ చోప్రా

న్యూఢిల్లీ: గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా కావాలనే ఓడిపోయిందంటూ వరుస కామెంట్లతో ఊదరగొడుతున్న పాకిస్తాన్‌ క్రికెటర్లకు భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యత ఆకాశ్‌ చోప్రా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ కావాలని ఓడిపోయిందనడంలో కొత్త వివాదానికి తెరలేపడమేనన్నాడు. ఒకసారి ఆ మ్యాచ్‌కు గురించి పూర్తిగా విశ్లేషిస్తే విషయం ఏమిటో అర్థమవుతుందన్నాడు. ఒకవైపు బౌండరీ లైన్‌ చిన్నదిగా ఉండటంతోనే తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ భారీగా పరుగులు చేసిందనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఇక ఛేజింగ్‌లో అది భారీ స్కోరు కావడంతో భారత్‌ పోరాడి ఓడిపోయిందనే విషయాన్ని గ్రహించాలన్నాడు. మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో అక్కడున్న పరిస్థితిని బట్టి ధోని ఆడాడే తప్ప మీరనుకున్నట్లె ఆడలేదని ఎలా విమర్శిస్తారన్నాడు. గత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌ కావాలనే ఓడిపోయిందనే పాక్‌ క్రికెటర్లు ఒక్క విషయం తెలుసుకోవాలన్నాడు. (టీమిండియా కావాలనే ఓడిపోయిందట!)

‘పాక్‌ను నాకౌట్‌కు చేరకుండా చేయడానికి ఇలా చేసిందని అంటున్నారు కదా.. ఇంగ్లండ్‌ మీకంటే బలమైన జట్టు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోతే ఇంటికెళ్లేది. ఆ మ్యాచ్‌ ఇంగ్లండ్‌ చాలా ముఖ్యమైనది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయుంటే మీకు ఎదురైన పరిస్థితే ఉండేది. ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి బలమైన ఇంగ్లండ్‌ను బయటకు పంపించాలని ఎందుకు అనుకోదు. బయట ఉండి మ్యాచ్‌ చూస్తూ కావాలనే ఓడిపోయిందనే వాదన సరైనది కాదు. టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించాలనే అంటున్నారు. అసలు ఏమి జరిగిందని కొత్త వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. భారత్‌పై ఇంగ్లండ్‌ ఎందుకు గెలవలేదని అంటే ఏ క్రికెట్‌ అభిమానిని అడిగినా చెబుతాడు. వివాదాస్పద థియరీలు వెతకడం మానేస్తే మంచిది’ అని ఆకాశ్‌ చోప్రా బదులిచ్చాడు. ఇకనైనా అనవసర రాద్దాంతానికి ముగింపు పలకాలని ఆకాశ్‌ చోప్రా సూచించాడు. గత వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయి తమ జట్టును నాకౌట్‌కు చేరకుండా చేయడమే లక్ష్యమని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు సికిందర్ బక్త్‌, అబ్దుల్‌ రజాక్‌, ముస్తాక్‌ అహ్మద్‌లు ఆరోపించిన సంగతి తెలిసిందే.(‘ధోని మాటకు చిర్రెత్తుకొచ్చింది’)

మరిన్ని వార్తలు