మిస్టరీ : అసలు ఆరోజు ఏం జరిగింది? 

29 Apr, 2020 02:13 IST|Sakshi
కోచ్‌ బాబ్‌ ఊమర్, ఇంజమామ్‌

కోచ్‌ బాబ్‌ ఊమర్‌ విషాద మరణం

2007 వన్డే ప్రపంచ కప్‌లో అనూహ్య ఘటన

ఎప్పటికీ వెలుగు చూడని నిజాలు

ప్రపంచ క్రికెట్‌లో విజయాలు, వైఫల్యాలే కాదు... వివాదాలు, వ్యాఖ్యలు, నిషేధాలు, శిక్షలు కొత్త కాదు. సుదీర్ఘ చరిత్ర గల ఆటలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఒక విషాదం క్రికెట్‌ను విస్తుపోయేలా చేసింది. వెస్టిండీస్‌లో 2007 వన్డే ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలో నాటి పాకిస్తాన్‌ కోచ్‌ బాబ్‌ ఊమర్‌ అనూహ్య మరణం సంచలనం రేపింది. సుదీర్ఘ విచారణ తర్వాత కూడా చావుకు కారణాన్ని పోలీసులు చెప్పలేకపోవడం మరింత బాధాకరం. ఒక మెగా ఈవెంట్‌ సాగుతున్నప్పుడు జరిగిన ఘటన అసలు నిజాలు వెలుగు చూడకుండా ‘మిస్టరీ’గానే మిగిలిపోయింది.

మార్చి 18, 2007... పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ బాబ్‌ ఊమర్‌ మరణించిన రోజు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో తన హోటల్‌ గదిలో తెల్లవారుజామున ఊమర్‌ అచేతనంగా పడి ఉండటాన్ని హోటల్‌ సిబ్బంది గుర్తించడంతో విషయం బయటపడింది. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారు. అంతకుముందు రోజే పసికూన ఐర్లాండ్‌ చేతిలో లీగ్‌ మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్‌ జట్టు వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించింది. బహుశా ఆ ఓటమిని ఆయన కాస్త సీరియస్‌గా తీసుకున్నారని అంతా అనుకున్నారు.

హత్య కేసుగా దర్యాప్తు... 
కథ అంతటితో ముగిసిపోలేదు. నాలుగు రోజుల తర్వాత జమైకా పోలీసులు ‘గొంతు పిసకడం వల్ల ఊపిరాడక’ ఊమర్‌ చనిపోయారని ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాతి నుంచి ఊమర్‌ మరణంపై దర్యాప్తు సినిమాను తలపించే రీతిలో ఒక క్రైమ్‌ స్టోరీ తరహాలో సాగింది. క్రికెట్‌ ప్రపంచం తాజా పరిణామంతో నివ్వెరపోయింది.  పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఓటమికి, కోచ్‌ హత్యకు సంబంధం ఉండవచ్చని అందరూ అనుమానించారు. పాక్‌ క్రికెట్‌ జట్టుకు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు అవినాభావ సంబంధం ఉందనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఐర్లాండ్‌ చేతిలో పరాజయం వెనక కూడా ఇలాంటిదేమో ఉందని అనుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఫిక్సింగ్‌ వ్యవహారంలో హాన్సీ క్రానే పేరు బయటకు వచ్చినప్పుడు దక్షిణాఫ్రికా కోచ్‌గా ఊమరే ఉన్నారు. దానికీ, దీనికీ కొందరు లంకె కలిపి చూశారు.

సహజంగా ముందుగానే పాకిస్తాన్‌ ఆటగాళ్లనే పోలీసులు అనుమానించారు. జింబాబ్వేతో మ్యాచ్‌ ఆడిన తర్వాత ఫ్లయిట్‌ ఎక్కడానికి సిద్ధమైన తరుణంలో పాక్‌ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ తదితరులను వెనక్కి పిలిచి పోలీసులు విచారించారు. సీసీటీవీ కెమెరాలు, సాక్షులు, హోటల్‌ సెక్యూరిటీ సిబ్బంది... ఇలా ఎవరిని విచారించినా స్పష్టత రాలేదు. ప్రపంచవ్యాప్తంగా పోలీసు విచారణలో లబ్దప్రతిష్టులైన స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసుల సహాయం తీసుకున్నా లాభం లేకపోయింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం కూడా ఇందులో భాగమైంది కానీ ఫిక్సింగ్‌ లేదా బెట్టింగ్‌ ఊమర్‌ మరణానికి కారణం కావచ్చని ఎవరూ చెప్పలేకపోయారు. నిజంగా హత్యే అయినా ప్రపంచకప్‌లాంటి ఈవెంట్‌ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద హోటల్‌లో ఒక జాతీయ జట్టు కోచ్‌ గదిలో దూరి అలా చేయడం సాధ్యమేనా అనిపించింది.

ఫోరెన్సిక్‌ నివేదికతో... 
ఊమర్‌ మరణాన్ని హత్యగా ప్రకటించడానికి ఫోరెన్సిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ ఈరి శేషయ్య (మన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి) ఇచ్చిన నివేదికే కారణమైంది. తన పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆయన ఊమర్‌కు ముందుగా విషం ఇచ్చి ఆ తర్వాత గొంతు పిసికారని రాశారు. అయితే తదుపరి పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎవరో కావాలని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అసలు శేషయ్యకు ఈ తరహా కేసులను డీల్‌ చేయడంలో ఏమాత్రం అనుభవం లేదని, ఆయన తప్పుగా నివేదిక ఇచ్చారంటూ జమైకా పోలీసులు కేసును మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. ముగ్గురు స్వతంత్ర వైద్య నిపుణులతో ఒక కమిటీ వేశారు.

సహజ మరణంగా ముద్ర... 
ఊహించినట్లుగానే ఈ కమిటీ శేషయ్య నివేదికను తప్పు పట్టింది. పోస్ట్‌మార్టం నిర్వహించిన సమయంలో ఆయన మరీ ప్రాథమిక స్థాయి తప్పులు చేశారని ఆరోపించింది. ఊమర్‌ శరీరంలో కనిపించిన స్వల్ప మోతాదు సైపర్‌ మెథ్‌రీన్‌కు మనిషిని చంపేంత తీవ్రత లేదని తేల్చింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ క్లైవ్‌ రైస్, ఆసీస్‌ దిగ్గజం ఇయాన్‌ చాపెల్‌ కూడా ఊమర్‌ది హత్య కావచ్చంటూ పదే పదే సందేహించినా జమైకా పోలీసులు పట్టించుకోలేదు. హత్య కాదనే వాదనకు అనుగుణంగా పోలీసులు కథనం అల్లుకుంటూ వచ్చారు.

చాలా కాలంగా ఊమర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అధిక బరువుతో పాటు టైప్‌–2 డయాబెటిస్‌ రోగి అని డాక్టర్లు చెప్పారు. చనిపోయిన ముందు రోజు బాగా తాగడం ప్రమాదం తీవ్రతను పెంచిందని, చివరకు గుండెపోటుతో చనిపోయాడని కమిటీ వెల్లడించింది. అన్నింటికి మించి పాకిస్తాన్‌లాంటి జట్టుకు కోచ్‌గా ఉంటే వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, ఘోర పరాభవం తర్వాత అది అతనిపై ప్రభావం చూపించిందని కూడా తేల్చారు.

ఓపెన్‌ వెర్డిక్ట్‌... 
సాక్ష్యాలు, సుదీర్ఘ విచారణ తర్వాత అదే ఏడాది నవంబరులో జమైకా కోర్టు ‘ఓపెన్‌ వెర్డిక్ట్‌’ అంటూ తుది తీర్పు వెలువరించింది. అంటే సదరు మృతిని అనుమానాస్పదంగానే తేల్చుతూ మరణానికి ఎలాంటి కారణాన్ని మాత్రం చెప్పలేకపోయింది. దాంతో ఫైల్‌ను మూసేశారు. భారత స్వాతంత్య్రానికి పూర్వం ఊమర్‌ తండ్రి మన దేశంలో సివిల్‌ సర్వెంట్‌గా పని చేశారు. 1948 మే 14న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పుట్టిన బాబ్‌ ఊమర్‌ జీవితం అలా విండీస్‌ గడ్డపై ముగిసింది. ఆయన ఇంగ్లండ్‌ జట్టు తరఫున 19 టెస్టులు, 6 వన్డేలు ఆడారు. తీర్పు తర్వాత ఊమర్‌ భార్య గిల్‌ మాట్లాడుతూ...‘ఇప్పుడు మేం చేయగలిగిందేమీ లేదు. అయితే పోలీసు విచారణలో చాలా తప్పులు జరిగాయనేది మాత్రం వాస్తవం’ అని వేదనతో ముగించడం నిజమేమిటో చెప్పకనే చెబుతుంది. 

ఇద్దరు కుమారులతో ఊమర్‌ భార్య గిల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా