ఐఓసీలో ‘ఐబా’ ప్రతినిధిగా మేరీకోమ్‌

24 Sep, 2017 01:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన భారత మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌కు అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్‌ ఫోరమ్‌లో ఆమె అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ–ఐబా) ప్రతినిధిగా పాల్గొననుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 33 ఏళ్ల మణిపూర్‌ స్టార్‌ బాక్సర్‌ గతేడాది ‘ఐబా’ లెజెండ్స్‌ అవార్డు అందుకుంది. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె... నవంబర్‌ 11 నుంచి 13 వరకు లుసానేలో జరిగే ఎనిమిదో ఐఓసీ అథ్లెట్స్‌ ఫోరమ్‌లో ఐబా ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.

‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఈ ఫోరమ్‌లో పాల్గొని తమ అభిప్రాయాల్ని పంచుకోవడమే ఈ వేదిక  ఉద్దేశం’ అని ఐబా... భారత బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌కు లేఖ రాసింది. అయితే వియత్నాంలో నవంబర్‌ 2 నుంచి 12 వరకు ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ టోర్నీ కోసం జరిగే ట్రయల్స్‌లో మేరీకోమ్‌ ఎంపికైతే అథ్లెట్స్‌ ఫోరమ్‌లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంటుంది.  

>
మరిన్ని వార్తలు